

లోక్‌సభలో జన్‌విశ్వాస్ సవరణ బిల్లు ఆమోదం
లోక్‌సభ జన్ విశ్వాస్ బిల్లు 2026ను బుధవారం వాయిస్ ఓటుతో ఆమోదించింది. చిన్నపాటి నేరాలను డీక్రిమినలైజ్ చేసి వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని పెంచడం ఈ బిల్లు లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లు ద్వారా 23 మంత్రిత్వ శాఖల పరిధిలో ఉన్న 79 కేంద్ర చట్టాల్లోని మొత్తం 784 నిబంధనలను సవరించనున్నారు. ఇందులో 717 నిబంధనలను క్రిమినల్ పరిధి నుంచి తొలగించగా, మరో 67 నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రతిపాదించారు. అదేవిధంగా వెయ్యికి పైగా చిన్నపాటి నేరాలకు సంబంధించిన పాత, అవసరం లేని నిబంధనలను తొలగించి నియంత్రణ వ్యవస్థను సరళీకరించనున్నారు. చర్చకు సమాధానంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌గోయల్ మాట్లాడుతూ, ఈ బిల్లు ప్రజలకు, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈస్) ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ సభ్యురాలు కే.కావ్య చేసిన సవరణలను సభ వాయిస్ ఓటుతో తిరస్కరించింది.
లోక్‌సభలో ‘జన్ విశ్వాస్’ బిల్లుపై వాగ్వాదం
‘జన్ విశ్వాస్ (సవరణ నిబంధనలు) బిల్లు–2026’పై అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ ఈ బిల్లును వ్యాపార సౌలభ్యం పెంచే దిశగా భారత చరిత్రలోనే అతిపెద్ద డీక్రిమినలైజేషన్ చర్యగా అభివర్ణిస్తే, కాంగ్రెస్ మాత్రం ఇది అవినీతిని ప్రోత్సహించి చట్టపరమైన బాధ్యతలను బలహీనపరుస్తుందని విమర్శించింది. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, చిన్నచిన్న నేరాలను క్రిమినల్ కేసుల నుంచి తొలగించడం ద్వారా వ్యాపారాలు చేయడం సులభమవుతుందని చెప్పారు. ఈ బిల్లు ద్వారా 23 మంత్రిత్వ శాఖల పరిధిలో ఉన్న 79 కేంద్ర చట్టాల్లో సవరణలు చేయాలని ప్రతిపాదిస్తున్నామని ఆయన తెలిపారు.
శిక్షలను తగ్గించడం సరైంది కాదు
బిల్లుపై చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ చట్టాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం దీన్ని డీక్రిమినలైజేషన్‌గా చూపుతున్నప్పటికీ వాస్తవానికి ఇది అవినీతి, మోసాలు, సంస్థల నియమాల ఉల్లంఘనలను సాధారణంగా తీసుకునేలా చేస్తుందని అన్నారు. ఈ బిల్లు ప్రజల విశ్వాసాన్ని పెంచదు, వారికి ద్రోహం చేస్తుంది. న్యాయం స్థానంలో ఆదాయం, బాధ్యత స్థానంలో పరిపాలనా సౌలభ్యాన్ని తీసుకురావాలని ఇది కోరుతోందని ఆయన విమర్శించారు.
ముఖ్యంగా మహిళల భద్రతపై ఈ బిల్లు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన అన్నారు. రైల్వేస్ యాక్ట్‌లోని సెక్షన్ 145 ప్రకారం రైళ్లలో మద్యం సేవించి అల్లరి చేసే వారికి ప్రస్తుతం కేవలం 24 గంటల జైలుశిక్ష మాత్రమే ఉందని, ఇది చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శిక్షలను తగ్గించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా సమాజ్‌వాది పార్టీ ఎంపీ హరేంద్ర సింగ్ మాలిక్ కూడా బిల్లుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు నేరాలపై బాధ్యతను తగ్గించే ప్రమాదం ఉందని అన్నారు. జైలుశిక్ష స్థానంలో చిన్న మొత్తంలో జరిమానాలు విధించడం ద్వారా చట్ట భయం తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది
బిల్లుకు మద్దతుగా మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఇది చిన్నచిన్న పరిపాలనా తప్పిదాలను క్రిమినల్ నేరాలుగా పరిగణించకుండా వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరుస్తుందని చెప్పారు. ఇది భారత చరిత్రలోనే అతిపెద్ద డీక్రిమినలైజేషన్ చర్య అని ఆయన పేర్కొన్నారు. ఒకే చట్టం ద్వారా వెయ్యికి పైగా నేరాలను డీక్రిమినలైజ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విధానం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన ఆయన, ఆంగ్లేయ భావజాలంతో గతంలో చిన్న తప్పిదాలకే క్రిమినల్ కేసులు పెట్టే విధానం కొనసాగిందని చెప్పారు. ఇప్పుడు ఆ విధానాన్ని మార్చి నమ్మకంపై ఆధారపడిన పరిపాలనను తీసుకువస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా ఎన్‌ఆర్. నారాయణమూర్తి ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఒక కంప్యూటర్ దిగుమతి చేసుకోవడానికి ఆయన ఢిల్లీకి 40–50 సార్లు రావాల్సి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో వ్యాపార స్వేచ్ఛను అణిచివేశారని ఆయన ఆరోపించారు.
అలాగే పరిశ్రమల దిగ్గజం జేఆర్‌డీ.టాటా, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు మధ్య జరిగిన సంభాషణను కూడా ఆయన ప్రస్తావించారు. వ్యాపార లాభాలను అశుభ పదంగా పేర్కొన్న దృక్పథం కాంగ్రెస్‌లో ఇప్పటికీ కొనసాగుతోందని విమర్శించారు.
సంస్కరణలు కీలకం
ప్రధాని నరేంద్రమోడీ తీసుకొచ్చిన ఈ సంస్కరణలు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశలో కీలకమని ఆయన అన్నారు. అమెరికాలో ఫ్రాంక్లిన్ డీ.రూజ్‌వెల్డ్, రోనాల్డ్‌రీగన్, బ్రిటన్‌లో మార్గరెట్ థాచర్ , చైనాలో డెంగ్ జియోపింగ్ , సింగపూర్‌లో లీ కువాన్ యో చేసిన ఆర్థిక సంస్కరణలతో పోల్చుతూ మోడీ సంస్కరణలను ప్రశంసించారు.
గత వారం ప్రభుత్వం జన్ విశ్వాస్ బిల్లుకు రెండో సంచికను ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో మొత్తం 784 నిబంధనల్లో సవరణలు ప్రతిపాదించబడగా, వాటిలో 717 నిబంధనలను డీక్రిమినలైజ్ చేయాలని సూచించారు. వ్యాపార సౌలభ్యం కోసం ఇది కీలక చర్యగా ప్రభుత్వం పేర్కొంటోంది. ఇది 2023లో అమలులోకి వచ్చిన జన్ విశ్వాస్ అమెండ్‌మెంట్ ఆఫ్ ప్రోవిజన్స్ ) యాక్ట్, 2023కు కొనసాగింపుగా తీసుకొచ్చిన సంస్కరణ. ఆ చట్టం ద్వారా 19 మంత్రిత్వ శాఖల పరిధిలో ఉన్న 42 కేంద్ర చట్టాల్లోని 183 నిబంధనలను డీక్రిమినలైజ్ చేశారు.
చిన్న నేరాలకు జైలు బదులు జరిమానా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్‌విశ్వాస్ బిల్లు 2026 ప్రకారం కొన్ని చిన్నపాటి నేరాలను క్రిమినల్ కేసుల పరిధి నుంచి తొలగించి జరిమానాలతో పరిష్కరించే విధానాన్ని ప్రతిపాదించారు. ఉదాహరణకు, ఒక కంపెనీ ప్రభుత్వం కోరిన కొన్ని నివేదికలు లేదా పత్రాలను సమయానికి సమర్పించకపోతే ఇప్పటివరకు క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉండేది. అయితే కొత్త బిల్లులో అలాంటి సందర్భాల్లో జైలుశిక్షకు బదులుగా కేవలం ఆర్థిక జరిమానా విధించే విధానాన్ని ప్రభుత్వం సూచిస్తోంది. ఇలాంటి మార్పుల ద్వారా చిన్నపాటి పరిపాలనా లోపాలను క్రిమినల్ నేరాలుగా పరిగణించకుండా వ్యాపార సౌలభ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాజ్యసభలో సీఏపీఎఫ్ బిల్లు ఆమోదం..ప్రతిపక్షం వాకౌట్
కేంద్ర సాయుధ పోలీసు దళాల పరిపాలనకు ఏకీకృత చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేసే సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌స్(సీఏపీఎఫ్) బిల్లు, 2026ను రాజ్యసభ బుధవారం వాయిస్ ఓటుతో ఆమోదించింది. అయితే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ బిల్లు ద్వారా ఐదు కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ప్రస్తుతం ఉన్న వేర్వేరు సేవా నియమావళుల స్థానంలో ఒకే విధమైన చట్టపరమైన వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చర్చకు సమాధానంగా కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ, దేశ భద్రతా వ్యవస్థను మరింత బలపర్చడమే ఈ బిల్లు ఉద్దేశమని చెప్పారు. సేవా నియమాలు, కేడర్ నిర్వహణ, నియామకాల వంటి అంశాల్లో ఉన్న అసమానతలను తొలగించి వ్యవస్థను సమర్థవంతంగా మార్చేందుకు ఇది సహాయపడుతుందని తెలిపారు.
కాలక్రమేణా కేంద్ర సాయుధ పోలీసు దళాల బాధ్యతలు విస్తరించడంతో వేర్వేరు నియమాలు, మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయని, దీనివల్ల అమల్లో స్పష్టత లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఒక సమగ్ర వ్యవస్థ అవసరమని అన్నారు. బిల్లు సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకమని వచ్చిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ, రాష్ట్ర పోలీసు వ్యవస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే దీని లక్ష్యమని స్పష్టం చేశారు.
అయితే ప్రతిపక్ష సభ్యులు బిల్లులోని కొన్ని నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి మరింతగా పరిశీలించాలని కోరారు. మంత్రి ఇచ్చిన సమాధానంలో ప్రధాన ఆందోళనలకు స్పందన లేదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. దీనికి ప్రతిస్పందనగా సభా నాయకుడు జేపీ.నడ్డా ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. పార్లమెంటరీ విధానాలకు వారు గౌరవం ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
