Let's talk: editor@tmv.in
లైంగిక వేధింపుల కేసులో ఎమ్మెల్యే రాహుల్‌ మామ్‌కూటతిల్‌కు బెయిల్‌

లైంగిక వేధింపుల కేసులో ఎమ్మెల్యే రాహుల్‌ మామ్‌కూటతిల్‌కు బెయిల్‌

Pinjari Chand
29 జనవరి, 2026

కేరళలో బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్‌ మామ్ కూటతిల్‌పై నమోదైన మూడో లైంగిక వేధింపుల కేసులో పతనంథిట్ట జిల్లా కోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన అరెస్టై 18 రోజుల అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 10, 2026న కేరళలోని తిరువల్ల ప్రాంతంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు, జనవరి 17న తిరువల్లలోని జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఈ కేసులో రాహుల్‌ మామ్ కూటతిల్‌కు బెయిల్‌ను తిరస్కరించింది. తొలి రెండు లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో ఆయనకు కోర్టుల నుంచి ఉపశమనం లభించినప్పటికీ, మూడో కేసులో మాత్రం అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. అభియోగాల ప్రకారం, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఓ మహిళను హోటల్‌కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై మూడో కేసు నమోదు అయింది. పాలక్కాడ్‌ ఎమ్మెల్యేపై నమోదైన ఈ మూడో కేసులో శారీరక దాడి, ఆర్థిక దోపిడీ, బలవంతపు గర్భస్రావం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో బెయిల్‌ విచారణను బాధితురాలి గుర్తింపు బయటకు రాకుండా క్లోజ్డ్‌ కోర్ట్‌ (ఇన్‌ కెమెరా)లో నిర్వహించారు. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం.జీ.దేవి అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకోగా, రక్షణ న్యాయవాది శాస్తమంగళం అజిత్‌కుమార్‌ అభిప్రాయాన్ని కూడా కోర్టు కోరింది. అనంతరం కేసుతో సంబంధం లేని వారిని కోర్టు హాలులోనుంచి బయటకు పంపి, వాదనలు వినిపించారు. మరోవైపు మొదటి లైంగిక వేధింపుల కేసులో రాహుల్‌ మామ్ కూటతిల్‌ అరెస్టును కేరళ హైకోర్టు నిలిపివేయగా, రెండో కేసులో ట్రయల్‌ కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. డిసెంబర్‌ 12న మొదటి లైంగిక వేధింపుల కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసు క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు ఈ కేసును తిరువనంతపురం సిటీ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు బదిలీతో రాహుల్‌ మామ్ కూటతిల్‌పై నమోదైన రెండు లైంగిక వేధింపుల కేసులను ఇప్పుడు అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ పూంగుజలి పర్యవేక్షిస్తున్నారు. ఆమె ఇప్పటికే రెండో కేసు దర్యాప్తును కూడా పర్యవేక్షిస్తున్నారు.

లైంగిక వేధింపుల కేసులో ఎమ్మెల్యే రాహుల్‌ మామ్‌కూటతిల్‌కు బెయిల్‌ - Tholi Paluku