Let's talk: editor@tmv.in
లైంగిక నేరాలపై సున్నితత్వం అవసరం: సుప్రీం

లైంగిక నేరాలపై సున్నితత్వం అవసరం: సుప్రీం

Pinjari Chand
19 ఫిబ్రవరి, 2026

మహిళ వక్షోజాలను పట్టుకోవడం, పైజామా దారాన్ని లాగడం వంటి చర్యలు కేవలం ‘అత్యాచారానికి సిద్ధత’ మాత్రమే కాదని, అవి స్పష్టంగా ‘అత్యాచార యత్నం’ కిందకే వస్తాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద ఉత్తర్వును రద్దు చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ ఎన్.వి. అంజారియా లతో కూడిన ధర్మాసనం, హైకోర్టు తీర్పు క్రిమినల్ న్యాయశాస్త్ర సూత్రాలకు విరుద్దంగా, హైకోర్టు న్యాయ నియమాలను తప్పుగా ప్రయోగించిందని వ్యాఖ్యానించింది. ఫిబ్రవరి 10న సుమోటోగా స్వీకరించిన కేసులో ఈ ఉత్తర్వు జారీ చేసింది. హైకోర్టు మార్చి 17, 2025న ఇచ్చిన తీర్పులో వక్షోజాలను పట్టుకోవడం, పైజామా దారాన్ని లాగడం అత్యాచారం కిందకి రాదని, కానీ మహిళను బలవంతంగా దుస్తులు విప్పించేందుకు ప్రయత్నించడం కిందకు వస్తుందని పేర్కొంది. ఆ తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేసింది.

సుప్రీంకోర్టు వివరణ

అభియోగాల వివరాలను పరిశీలిస్తే, నిందితులు ముందస్తు ఉద్దేశంతో అత్యాచారం చేయడానికి ప్రయత్నించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇవి కేవలం సిద్ధత చర్యలుగా పరిగణించలేము. అయితే, ఈ వ్యాఖ్యలు ప్రాథమిక దశలో చేసిన పరిశీలన మాత్రమేనని, నిందితుల దోషిత్వంపై తుది నిర్ణయం ట్రయల్ కోర్టులో ఆధారాలపై తీసుకుంటారని స్పష్టం చేసింది. అదే సమయంలో, లైంగిక నేరాలు, సున్నితమైన కేసులు విచారించే సమయంలో న్యాయమూర్తుల్లో సున్నితత్వం, కరుణ పెంపొందించే మార్గదర్శకాలు రూపొందించాలని జాతీయ న్యాయ అకాడమీ (భోపాల్)కి ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, మూడు నెలల్లో ముసాయిదా మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సూచించింది. ఈ అంశాన్ని ‘వీ ది ఉమెన్ ఆఫ్ ఇండియా’ అనే సంస్థ లేఖ ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. హైకోర్టు తీర్పు చట్టపరంగా తప్పు, సున్నితత్వం లేని వ్యాఖ్యలతో మహిళల రక్షణ ప్రయత్నాలను దెబ్బతీస్తుందని ఆ సంస్థ పేర్కొంది.

ఈ సందర్భంగా కాస్ గంజ్ ప్రత్యేక పోక్సో న్యాయమూర్తి జూన్ 23, 2023న జారీ చేసిన సమన్లను పునరుద్ధరించింది. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 376 (అత్యాచారం)తో పాటు పోక్సో చట్టం కింద ‘అత్యాచార యత్నం’ ఆరోపణలను మళ్లీ అమల్లోకి తెచ్చింది.

కేసు వివరాలు

ఫిర్యాదు ప్రకారం, 2021 నవంబర్ 10న బాధితురాలు తన 14 ఏళ్ల కుమార్తెతో కలిసి వస్తుండగా గ్రామానికి చెందిన పవన్, ఆకాశ్, అశోక్ అనే వ్యక్తులు లిఫ్ట్ ఆఫర్ చేశారు. మధ్యలో మోటార్‌సైకిల్ ఆపి బాలికపై అసభ్యంగా ప్రవర్తించారని, పైజామా దారాన్ని లాగి కాలువ క్రిందికి ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బాలిక అరుపులు విని ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పారిపోయినట్లు కేసు వివరాలు చెబుతున్నాయి. ఈ ఘటనపై దాఖలైన రివిజన్ పిటిషన్‌పై హైకోర్టు ఆరోపణలను తగ్గించగా, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది.