
లైంగిక దాడి కేసులో ఎమ్మెల్యే రాహుల్ మాంకూటతిల్ అరెస్టు
లైంగిక దాడి కేసులో కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే రాహుల్ మాంకూటతిల్‌ను ఆదివారం తెల్లవారుజామున పాలక్కాడ్‌లో అదుపులోకి తీసుకున్న అనంతరం అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆదివారం ఉదయం ఆయనను పతనంతిట్టలోని పోలీస్ క్యాంప్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం, పతనంతిట్ట జిల్లా వాసి ఒకరు చేసిన ఫిర్యాదు మేరకు, పాలక్కాడ్ ఎమ్మెల్యే అయిన రాహుల్ మాంకూటతిల్‌పై తాజాగా మూడో లైంగిక దాడి కేసు నమోదైంది. బాధిత మహిళ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చినట్లు చెప్పారు. సమాచారం ప్రకారం ఫిర్యాదుదారు వివాహిత కాగా, తన దాంపత్య జీవితంలో ఏర్పడిన సమస్యల నేపథ్యంలో రాహుల్ మాంకూటతిల్‌తో పరిచయం ఏర్పడిందని తెలిపారు. వివాహం చేస్తానని హామీ ఇచ్చి, తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అనంతరం ఆమె గర్భవతి అయినప్పుడు బాధ్యత తీసుకోవడానికి ఆయన నిరాకరించడమే కాకుండా, గర్భస్రావం చేయించుకోవాలని బెదిరించాడని ఆరోపించింది. పలు సందర్భాల్లో తన నుంచి డబ్బులు తీసుకున్నాడని కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
కేసు నమోదు చేసిన తర్వాత, రాహుల్ మాంకూటతిల్‌పై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ప్రత్యేక బృందం, ఆయన బస చేస్తున్న హోటల్ గదికి అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో చేరుకున్నట్లు వర్గాలు తెలిపాయి. అక్కడ నుంచి రాత్రి సుమారు 1 గంటకు ఆయనను అదుపులోకి తీసుకుని, ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పతనంతిట్ట పోలీస్ క్యాంప్‌కు తరలించారు. ఇప్పటికే ఇలాంటి రెండు కేసులపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కే తాజా కేసు దర్యాప్తు బాధ్యత కూడా అప్పగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
14 రోజుల పాటు కస్టడీకి
ఎస్‌ఐటీ అధిపతి జి. పూంగుజాలి పోలీస్ క్యాంప్‌కు చేరుకుని, రాహుల్ మాంకూటతిల్‌ను విచారిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయన అరెస్టును అధికారికంగా నమోదు చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఆయనను 14 రోజుల పాటు జుడిషియల్ కస్టడీకి కోర్టు పంపింది. మొదటి కేసులో — అత్యాచారం, గర్భస్రావం చేయించడంపై ఆరోపణలతో సంబంధం ఉన్న కేసులో — కేరళ హైకోర్టు రాహుల్ మాంకూటతిల్‌కు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించింది. రెండో కేసులో, తిరువనంతపురం సెషన్స్ కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ మాంకూటతిల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది.
గత సంవత్సరం, పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి జరిగిన ఉపఎన్నికల్లో, గతంలో ఆ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నేత షఫీ పరంపిల్ కోజికోడ్ జిల్లా వడకర లోక్‌సభ ఉపఎన్నికలో గెలవడంతో, ఆయన స్థానంలో రాహుల్ మాంకూటతిల్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. పాలక్కాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏ. థంకప్పన్ మాట్లాడుతూ, రాహుల్ మాంకూటతిల్‌కు ఇకపై పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆయన కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికల్లో గెలిచినది నిజమే. కానీ ఫిర్యాదులు అందిన వెంటనే, కేసులు నమోదు కావడంతో పార్టీ ఆయనను బహిష్కరించిందని తెలిపారు. ఇలాంటి తీవ్రమైన కేసులు ఇతర పార్టీల్లోని నేతలపై కూడా ఉన్నాయి. వారిపై ఏ చర్యలు తీసుకున్నారో కూడా ప్రశ్నించాలని ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీ నేత పీ.కె. కృష్ణదాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బాధితుల కంటే రాహుల్ మాంకూటతిల్‌కే ఎక్కువ మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇప్పటివరకు ఆయనను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని అడగలేదు. ఆయన రాజీనామా పత్రాన్ని కూడా పొందలేదు. కాంగ్రెస్ టికెట్‌పైనే ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి, ఆయన రాజీనామా కోరాల్సిన బాధ్యత పార్టీపై ఉందని కృష్ణదాస్ ఒక టీవీ చానల్‌కు తెలిపారు.
కాంగ్రెస మద్దతుతో ప్రజా కార్యక్రమాలకు హాజరయ్యాడు
కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి మాట్లాడుతూ పాలక్కాడ్ ఎమ్మెల్యేపై రెండు మూడు కాదు, డజన్ల కొద్దీ ఫిర్యాదులు ఉన్నాయని అన్నారు. ఆయన పదవి వల్ల ఎలాంటి రక్షణ కూడా లభించకుండా కాంగ్రెస్ చూసుకోవాలి. కాంగ్రెస్ వర్గాలు ఇప్పటికీ ఆయనకు మద్దతుగా ఉన్నాయని మా వద్ద సమాచారం ఉంది. చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. కేసులు నమోదు అయిన తర్వాత కూడా, కాంగ్రెస్ నేతల మద్దతుతో రాహుల్ మాంకూటతిల్ పలు ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడని ఆయన ఆరోపించారు. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ పాలనలో, బిషప్ ఫ్రాంకో ములక్కల్, నటుడు దిలీప్, తంత్రి రాజీవరు, రాహుల్ మాంకూటతిల్, రాజకీయ నేత పీ.సి. జార్జ్, పురాతన వస్తువుల మోసం కేసు నిందితుడు మాన్సన్ మావుంకల్, మంజేశ్వరం మాజీ ఎమ్మెల్యే ఎం.వి. కమరుద్దీన్, కార్యకర్త రాహుల్ ఈశ్వర్ వంటి పలువురు ప్రభావశీలులను కూడా అరెస్టు చేసినట్లు శివన్‌కుట్టి గుర్తు చేశారు. పినరయి విజయన్ ప్రభుత్వం అభివృద్ధిలోనే కాదు, నేరం చేసిన వారు ప్రముఖులైనా సరే — చట్టం ముందు నిలబెట్టడంలో కూడా ఆదర్శంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే అరెస్టు అనంతరం బాధితురాలి భావోద్వేగ పోస్టు
తాజా లైంగిక దాడి కేసులో కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే రాహుల్ మాంకూటతిల్ అరెస్టు అనంతరం, ఆయనపై తొలిసారిగా ఫిర్యాదు చేసిన మహిళ ఆదివారం తన సోషల్ మీడియా ఖాతాలో ఒక భావోద్వేగ సందేశం పోస్ట్ చేశారు.
తాను ఎదుర్కొన్న బాధ, విమర్శలు, ద్రోహం మధ్య కూడా నిజాన్ని బయటపెట్టే ధైర్యాన్ని తనకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపింది. చీకటిలో జరిగిన ప్రతి పనిని నీవు చూశావు. ప్రపంచానికి చేరని మా ఏడుపులను నీవు విన్నావని ఆమె రాసింది. తమ శరీరాలు అపవిత్రం చేయబడిన సమయంలో, అలాగే తమ గర్భంలో ఉన్న శిశువులను బలవంతంగా కోల్పోయిన వేళ కూడా, తమను ఒకటిగా నిలబెట్టింది విశ్వాసమేనని ఆమె పేర్కొంది. ఈ వ్యాఖ్యలు, మూడో కేసులో బాధితురాలిని కూడా మాంకూటతిల్ గర్భస్రావానికి బలవంతం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో వచ్చాయి.
తప్పుడు వ్యక్తులపై విశ్వాసం ఉంచినందుకు, మా పిల్లల తండ్రిగా అర్హతలేని వ్యక్తిని ఎంచుకున్నందుకు, స్వర్గంలో ఉన్న మా దైవదూత శిశువులు మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నామని ఆమె పేర్కొంది. గర్భస్రావానికి గురైన శిశువుల ఆత్మలు హింస, భయం లేని లోకంలో ప్రశాంతంగా విశ్రాంతి పొందాలని, బాధితులను రక్షించడంలో విఫలమైన ఈ ప్రపంచం నుంచి విముక్తి పొందాలని ఆమె ఆకాంక్షించింది. మా కన్నీళ్లు స్వర్గానికి చేరితే, అవి మీకు ఇది చెప్పాలి – మీ అమ్మ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేదు. మీ ఉనికికి విలువ ఉంది. మీ ఆత్మకు విలువ ఉంది. మళ్లీ కలిసే వరకు తల్లులు మిమ్మల్ని మా హృదయాల్లో మోసుకుంటూనే ఉంటాం అని ఆమె భావోద్వేగంగా రాసింది.
మొదటి కేసులో తిరువనంతపురం సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించినప్పటికీ, కేరళ హైకోర్టు జనవరి 21 వరకు ఆయన అరెస్టుపై తాత్కాలిక రక్షణ కల్పించింది. ఆ రోజున ఈ అంశాన్ని మళ్లీ విచారించనున్నారు. ఇటీవల బాధితురాలి మాజీ భర్త కూడా బహిరంగంగా ముందుకు వచ్చి, తనను ఈ కేసులోకి లాగేందుకు మాంకూటతిల్ ప్రయత్నించాడని ఆరోపించారు.
ఎమ్మెల్యే అనర్హతపై న్యాయాభిప్రాయం కోరనున్న అసెంబ్లీ స్పీకర్
తాజా లైంగిక దాడి కేసులో అరెస్టయిన పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మాంకూటతిల్ పై కఠిన చర్యలకు కేరళ శాసనసభ స్పీకర్ ఎ.ఎన్. షంషీర్ సంకేతాలు ఇచ్చారు. ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించే ప్రక్రియ ప్రారంభించాలా అనే అంశంపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుంటామని స్పీకర్ తెలిపారు. మీడియాతో మాట్లాడిన స్పీకర్, పలు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మాంకూటతిల్ ఎమ్మెల్యేగా కొనసాగడం సమాజానికి తప్పుడు సందేశం ఇస్తుందని అన్నారు. ఇంత తీవ్రమైన ఆరోపణలు ఒక శాసనసభ్యుడిపై రావడం ఇదే తొలిసారి అని పేర్కొన్న ఆయన, ఈ వ్యవహారాన్ని ప్రివిలేజ్ అండ్ ఎథిక్స్ కమిటీకి పంపిస్తామని చెప్పారు. మాంకూటతిల్ అరెస్టు నిర్దిష్ట న్యాయ ప్రక్రియల ప్రకారమే జరిగిందని, ఆ మేరకు దర్యాప్తు అధికారులు తనకు సమాచారం ఇచ్చారని ఆయన అన్నారు.
అరెస్టైన ఎమ్మెల్యేతో కాంగ్రెస్ దూరం
లైంగిక దాడి కేసులో అరెస్టయిన పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మాంకూటతిల్ తో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దూరంగా ఉందని స్పష్టం చేసింది. ఆయనను ఇప్పటికే చాలా కాలం క్రితమే పార్టీ నుంచి బహిష్కరించామని, ప్రస్తుతం ఆయనతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని పార్టీ నేతలు తెలిపారు.సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె. మురళీధరన్ మాట్లాడుతూ, మాంకూటతిల్‌పై ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే పార్టీ అతనిపై చర్యలు తీసుకుందని చెప్పారు. ఆయన తప్పు చేశాడని గుర్తించిన వెంటనే పార్టీ నుంచి తొలగించాం. ఆ తర్వాత ఆయన వ్యవహారాలకు కాంగ్రెస్ ఎలాంటి బాధ్యత వహించదు. పార్టీ ఈ విషయంలో జవాబుదారీ కాదని స్పష్టం చేశారు. మాంకూటతిల్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ సరైన సమయంలో తన ‘బ్రహ్మాస్త్రం’ ప్రయోగించిందని, అందువల్ల ఇప్పుడు పార్టీపై ఎలాంటి బాధ్యత లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎప్పుడూ తప్పులను సమర్థించదు. ఎవరైనా తప్పు చేస్తే, వారి మీద శిక్షా చర్యలు తీసుకోవడం మా సంప్రదాయమని ఆయన అన్నారు.
