Let's talk: editor@tmv.in
లెబనాన్‌పై దాడులు ఆపాలి.. నెతన్యాహు తీరుపై స్పెయిన్ ప్రధాని ఆగ్రహం

లెబనాన్‌పై దాడులు ఆపాలి.. నెతన్యాహు తీరుపై స్పెయిన్ ప్రధాని ఆగ్రహం

Shaik Mohammad Shaffee
10 ఏప్రిల్, 2026

లెబనాన్‌పై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడులపై అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు అనుసరిస్తున్న మొండి వైఖరిని స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించని నెతన్యాహు తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ను కూడా భాగం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

‘మానవత్వం పట్ల గౌరవం లేదు’

గురువారం మాడ్రిడ్‌లో జరిగిన ఒక సభలో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ మాట్లాడుతూ.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను తీవ్రంగా తప్పుబట్టారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సామాన్య ప్రజల ప్రాణాలన్నా, అంతర్జాతీయ చట్టాలన్నా కనీస గౌరవం లేదని, ఆయన ప్రవర్తన అస్సలు బాలేదని విమర్శించారు. లెబనాన్‌లో జరుగుతున్న ఈ దాడులను ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఇజ్రాయెల్‌తో ఉన్న వ్యాపార, ఇతర ఒప్పందాలను యూరోపియన్ యూనియన్ వెంటనే రద్దు చేసుకోవాలని, అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఇలాంటి నేరపూరిత చర్యలకు కచ్చితంగా శిక్ష పడాలని శాంచెజ్ డిమాండ్ చేశారు.

ఒప్పందానికి తూట్లు.. ఇరాన్ హెచ్చరిక

మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రమాదంలో పడేస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ హెచ్చరించారు. లెబనాన్‌పై దాడులు కొనసాగించడం వల్ల పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి ప్రాంతాల్లో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "అమెరికా ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి కాల్పుల విరమణను కాపాడటం, లేదా ఇజ్రాయెల్ ద్వారా యుద్ధాన్ని కొనసాగించడం. రెండూ ఒకేసారి జరగవు. ఇప్పుడు బంతి అమెరికా కోర్టులోనే ఉంది" అని అరాక్చీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పష్టం చేశారు.

లెబనాన్ ఆ పరిధిలోకి రాదు: శ్వేతసౌధం స్పష్టత

అయితే స్పెయిన్, ఇరాన్ విజ్ఞప్తులను అమెరికా తోసిపుచ్చింది. ప్రస్తుత ఒప్పందం కేవలం అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణల నియంత్రణకు ఉద్దేశించినదే తప్ప, లెబనాన్‌లో హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ జరిపే దాడులకు ఇది వర్తించదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ స్పష్టం చేశారు. "లెబనాన్ ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగం కాదు. ఈ విషయాన్ని ఇప్పటికే అన్ని వర్గాలకు తెలియజేశాం. అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలకు నెతన్యాహు పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికాకు ఇజ్రాయెల్ ఒక నమ్మకమైన భాగస్వామిగా కొనసాగుతుంది" అని ఆమె వివరించారు.

ముందుకు సాగాల్సిందే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరూ ఒకే మాటపై ఉన్నారు. లెబనాన్‌పై సైనిక చర్యలు కొనసాగుతాయని, అది తమ దేశ రక్షణకు అవసరమని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. కాగా ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు జరుగుతున్న ప్రయత్నాలకు ఆటంకంగా మారతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.