
‘లుంగీవాలా’ వ్యాఖ్యలపై రాజ్యసభలో రగడ
సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్‌ను బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ ‘లుంగీవాలా’ అంటూ అవమానకరంగా వ్యాఖ్యానించారన్న ఆరోపణలతో రాజ్యసభలో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే జాబితా చేసిన పత్రాలను సభా పోడియం పై ఉంచిన అనంతరం బ్రిట్టాస్ తనపై ‘లుంగీవాలా’ అంటూ వ్యాఖ్యలు చేశారన్న అంశాన్ని లేవనెత్తారు. దీనిపై ప్రతిపక్ష సభ్యులు ఆయనకు మద్దతుగా నిలిచారు. అయితే, సుష్మితా దేవ్ వాదనను కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అధికారపక్ష సభ్యులు కోరారు.దీంతో సభలో గందరగోళం నెలకొనగా, రాజ్యసభ చైర్మన్ సి.పీ. రాధాకృష్ణన్ జోక్యం చేసుకున్నారు. సంబంధిత ఎంపీలను తన ఛాంబర్‌కు పిలిపించి మాట్లాడతానని తెలిపారు.
‘లుంగీవాలా’ అంటూ పలుమార్లు పిలిచారు: బ్రిట్టాస్
సోమవారం సభలో ఆదాయపు పన్ను (సవరణ) ఆర్డినెన్స్–2026పై చట్టబద్ధ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న సమయంలో బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ తనకు కేటాయించిన సీటు నుంచి లేచి తన వెనుక ఉన్న సీటుకు వచ్చారని బ్రిట్టాస్ ఆరోపించారు. ఆ సమయంలో ఆమె తనను పలుమార్లు ‘లుంగీవాలా’ అని పిలిచారని ఆయన సభలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బ్రిట్టాస్ ఇప్పటికే సుష్మితా దేవ్‌పై హక్కుల తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. ఈ అంశంపై స్పందించిన చైర్మన్.. సభలో సభ్యులు ఒకరినొకరు అగౌరవపరిచేలా, అసభ్యంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇతర సభ్యుల మనోభావాలను దెబ్బతీయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
సుష్మితా దేవ్ వివరణ
మధ్యాహ్నం సభ తిరిగి సమావేశమైన అనంతరం సుష్మితా దేవ్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ఏ రాష్ట్రానికి చెందిన వస్త్రధారణను కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. ‘నేను అసోంకు చెందిన బెంగాలీని. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల దుస్తులు ధరిస్తారని నాకు తెలుసు. నేను గానీ, మరే సభ్యుడుగానీ ఏ రాష్ట్రం దుస్తులనూ కించపరచలేదు’ అని ఆమె పేర్కొన్నారు. జాన్ బ్రిట్టాస్ తనకు చాలా కాలంగా తెలుసని, ఆయనకు తనను కలిసి ఏదైనా చెప్పాల్సిన అవసరం ఉందని భావిస్తే తాను మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రాజ్యసభ నుంచి భారత్‌ను సాంస్కృతికంగా లేదా మతపరంగా విభజించే సందేశం వెళ్లకూడదని ఆమె అన్నారు. ఇద్దరు ఎంపీల మధ్య నెలకొన్న అపార్థాన్ని తాను పరిష్కరిస్తానని రాజ్యసభలో సభా నాయకుడు జేపీ నడ్డా తెలిపారు. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా సంబంధిత సభ్యులిద్దరినీ పిలిచి చైర్మన్ వారి వాదనలు వినాలని కోరారు.
రామాలయ విరాళాల అంశంపైనా నినాదాలు
మరోవైపు, కాంగ్రెస్ నేతృత్వంలోని కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామాలయానికి ఇచ్చిన విరాళాల చోరీకి సంబంధించిన ఆరోపణలపై వారు నినాదాలు చేశారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ నేపథ్యంలో చైర్మన్ సభను వాయిదా వేశారు.
