
‘లీగల్ స్టడీస్’ ఖరారు చేయడానికి కమిటీ ఏర్పాటు చేయండి: సుప్రీంకోర్టు
ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల వివాదం నేపథ్యంలో సుప్రీం కోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. లీగల్ స్టడీస్‌కు సంబంధించిన పాఠ్యాంశాన్ని ఖరారు చేయడానికి వారం రోజుల్లో డొమైన్ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయవ్యవస్థ పనితీరుపై ఆరోగ్యకరమైన, నిష్పక్షపాత విమర్శలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు ఇవ్వలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సామాజిక శాస్త్ర పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ఉన్న ‘అభ్యంతకరమైన’ అంశాలపై కోర్టు స్వయంగా (సుమోటోగా) తీసుకున్న కేసును విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ అధ్యాయాన్ని పాఠ్యపుస్తక అభివృద్ధి బృందం రూపొందించిందని, ఆ బృందానికి ప్రొఫెసర్ మైకేల్ డానినో అధ్యక్షత వహించారని కోర్టు గుర్తించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సుర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, విశ్వవిద్యాలయాలు వెంటనే ఆ వివాదాస్పద అధ్యాయాన్ని రూపొందించిన ముగ్గురు నిపుణులతో తమ అనుబంధాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఆ బృందంలో సభ్యులుగా సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్నకుమార్ ఉన్నారు. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు జోయ్‌మాల్యబాగ్చీ, విపుల్ ఎం.పంచోలీ కూడా సభ్యులుగా ఉన్నారు. అవసరమైతే ఈ ముగ్గురు నిపుణులు కోర్టు ఆదేశాలను సవరించమని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని బెంచ్ తెలిపింది.
అన్ని పాఠ్యపుస్తకాలను సమీక్షించాలి
లీగల్ స్టడీస్ పాఠ్యాంశాన్ని ఖరారు చేసే కమిటీలో ఒక మాజీ న్యాయమూర్తి, ఒక విద్యావేత్త, ఒక ప్రముఖ న్యాయవాది ఉండాలని కోర్టు సూచించింది. అలాగే పాఠ్యాంశం తుది రూపు దిద్దడంలో నేషనల్ జుడీషియల్ అకాడమీ (భోపాల్)ను కూడా భాగస్వామ్యం చేయాలని కేంద్రానికి ఆదేశించింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అన్ని తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను సమీక్షించమని ఎన్‌సీఈఆర్‌టీకి సూచించినట్లు కోర్టుకు తెలిపింది. అయితే, ఎన్‌సీఈఆర్‌టీని మాత్రమే సమీక్ష చేయమని చెప్పడం కంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి పాఠ్యాంశాన్ని పరిశీలిస్తే మెరుగ్గా ఉండేదని కోర్టు వ్యాఖ్యానించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హామీ ఇస్తూ, డొమైన్ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి పాఠ్యాంశాన్ని సమగ్రంగా పరిశీలిస్తామని తెలిపారు. ఇకపై నిపుణుల పరిశీలన లేకుండా ఏ విషయాన్ని ప్రచురించమని కూడా చెప్పారు.
ఇదిలా ఉండగా, ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ కోర్టుకు అఫిడవిట్ సమర్పిస్తూ క్షమాపణలు తెలిపినట్లు కేంద్రం వెల్లడించింది. ఫిబ్రవరి 26న సుప్రీంకోర్టు 8వ తరగతి సామాజిక శాస్త్ర పుస్తకంలో న్యాయవ్యవస్థపై అవమానకర వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొంటూ ఆ పుస్తకాన్ని ముద్రించడం, మళ్లీ ప్రచురించడం లేదా డిజిటల్ రూపంలో పంచడం అన్నింటిపై పూర్తి నిషేధం విధించింది. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ముద్రిత, డిజిటల్ ప్రతులను తక్షణమే స్వాధీనం చేసుకుని ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని కూడా ఆదేశించింది.
