
లిఖ్టెన్‌స్టెయిన్‌లో పీయూష్ గోయల్ పర్యటన: భారత్- ఈఎఫ్‌టీఏ వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు
భారత్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్‌టీఏ) దేశాల మధ్య కుదిరిన చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలులో భాగంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ లిఖ్టెన్‌స్టెయిన్ దేశంలో పర్యటించారు. ఒక భారత క్యాబినెట్ మంత్రి ఈ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ఆయన అక్కడి అగ్రశ్రేణి కంపెనీల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
పెట్టుబడులకు ఆహ్వానం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత్ - ఈఎఫ్‌టీఏ ఒప్పందం కేవలం వాణిజ్యానికే పరిమితం కాదని, ఇది పెట్టుబడులు, సాంకేతిక సహకారం, నైపుణ్యాభివృద్ధికి ఒక వారధి అని పేర్కొన్నారు. రాబోయే 15 ఏళ్లలో ఈఎఫ్‌టీఏ దేశాలు భారత్‌లో 100 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8.3 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టాలనే లక్ష్యాన్ని చేరుకోవాలని, భారత్‌ను తమ వ్యాపారాలకు ప్రధాన కేంద్రంగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
హిల్టీ గ్రూప్ కార్యాలయంలో చర్చలు
ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ 'హిల్టీ' ప్రధాన కార్యాలయాన్ని గోయల్ సందర్శించారు. కంపెనీ సిఇఓ జహంగీర్ దూంగాజీతో సమావేశమై, భారత్‌లో తయారీ రంగాన్ని విస్తరించడం, ఇక్కడి నుండి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులను పెంచడంపై చర్చించారు. మౌలిక సదుపాయాల రంగంలో అధునాతన సాంకేతికతను వినియోగించడంపై కూడా వారు దృష్టి సారించారు.
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం
పర్యటనలో భాగంగా గోయల్ లిఖ్టెన్‌స్టెయిన్ దేశ అగ్రనాయకత్వంతో భేటీ అయ్యారు. ప్రధాని బ్రిగిట్టే హాస్‌తో సమావేశమయ్యి భారత యువత నైపుణ్యాన్ని లిఖ్టెన్‌స్టెయిన్ పారిశ్రామిక నైపుణ్యంతో అనుసంధానించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై చర్చించారు.
అలాగే లిఖ్టెన్‌స్టెయిన్ యువరాజు అలోయిస్‌ను కలిసిన గోయల్, ఫిబ్రవరి 2026లో న్యూఢిల్లీలో జరగనున్న 'ఇండియా - ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' కు హాజరుకావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ పంపిన ఆహ్వాన లేఖను అందజేశారు.
లిఖ్టెన్‌స్టెయిన్ ఉప ప్రధాని సబైన్ మోనౌనీతో కలిసి క్లీన్ టెక్నాలజీ, గ్రీన్ ఫైనాన్స్, ఇన్నోవేషన్ రంగాల్లో సహకారంపై చర్చించారు.
భారత్, ఈఎఫ్‌టీఏ (ఐస్లాండ్, లిఖ్టెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్) దేశాల మధ్య 2024 మార్చిలో ఈ ఒప్పందం కుదరగా, 2025 అక్టోబర్ 1 నుండి ఇది అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా భారత్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు రావడంతో పాటు, లక్షలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
