
లిక్కర్ స్కాం కేసులో నిందితులకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్
గత జగన్ ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో బిగ్ రీలిఫ్ లభించింది. రూ.3,500 కోట్ల ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. ముఖ్య నిందితులైన ముగ్గురికి లొంగిపోవాల్సిన అవసరం లేకుండా తాత్కాలిక రక్షణ కల్పించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసిన డిఫాల్ట్ బెయిల్‌ను పునరుద్ధరిస్తూ బాలాజీ గోవిందప్ప, పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి, కె. ధనుంజయ రెడ్డి అనే ముగ్గురు నిందితులకు లొంగిపోవద్దని ఆదేశించింది. ఈ ముగ్గురూ నవంబర్ 26లోగా ట్రయల్ కోర్టులో లొంగిపోయి రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేయాలని హైకోర్టు ఆదేశించగా... సుప్రీంకోర్టు ఆ ఆదేశంపై స్టే విధించింది.
నిందితులు ఎవరంటే
• కె. ధనుంజయ రెడ్డి – రిటైర్డ్ ఐఎఎస్, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం కార్యాలయంలో సెక్రటరీ.
• పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి – జగన్‌కు అత్యంత సన్నిహితుడు, అప్పటి ఓఎస్టీ.
• బాలాజీ గోవిందప్ప – భారతి సిమెంట్స్ డైరెక్టర్.
కోర్టులో ఏం జరిగింది?
400 మంది సాక్షులున్నా? ఎంతమంది ఉన్నా 100 మందికే పరిమితం అవుతారు. ఇంతమంది సాక్షులతో ట్రయల్ ఎప్పటికి పూర్తవుతుంది? డిఫాల్ట్ బెయిల్ హక్కును ఎందుకు లాగుతారు? అని సీజేఐ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా "చార్జ్‌షీట్‌ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడు తిరిగి వచ్చింది, ట్రయల్ వేగవంతం చేస్తామని వాదించారు. ఈ ముగ్గుర్నీ జైల్లో పెట్టడం వల్ల మీకు ఏం లాభం? ఒకరు సీనియర్ అధికారి... సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటే షరతులు పెట్టొచ్చు. కానీ లొంగిపోవాల్సిన అవసరం లేదని సీజేఐ ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ముగ్గురూ లొంగిపోనవసరం లేదని, ట్రయల్ కోర్టు విధించిన షరతులు కొనసాగుతాయని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది.
కేసు నేపథ్యం
2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పంపిణీలో రాజకీయ-వ్యాపారవేత్తల కుమ్మక్కు, పాపులర్ బ్రాండ్స్‌ను నిషేదించడం, కొత్త లేబుళ్లకు ప్రాధాన్యం, కిక్‌బ్యాక్స్ వసూళ్లు జరిగాయని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులు నిందితులుగా ఉన్నారు.
