Let's talk: editor@tmv.in
లాల్‌దర్వాజా బోనాలకు పటిష్ట భద్రత.. ఏఐ కెమెరాలతో నిఘా

లాల్‌దర్వాజా బోనాలకు పటిష్ట భద్రత.. ఏఐ కెమెరాలతో నిఘా

Gaddamidi Naveen
10 ఆగస్టు, 2026

ఆషాఢ బోనాల సందర్భంగా పాతబస్తీలోని లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ ఆదివారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, భక్తుల సహకారంతో ఉత్సవాలు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని వెల్లడించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలలో 48 గంటల పాటు నిరంతర మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల సహకారంతో బోనాల ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.

ఏఐ ఆధారిత కెమెరాలతో నిరంతరం నిఘా కొనసాగిస్తూ దొంగలు, చైన్‌ స్నాచర్లను త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బందోబస్తు కోసం రెండు షిఫ్టుల్లో మొత్తం 2,400 మంది పోలీసులను మోహరించారు. అదనంగా షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్‌ను రంగంలోకి దింపడంతో పాటు ఆలయాల వద్ద స్టాటిక్ పికెట్లు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు ఊరేగింపు మార్గాల్లో డ్రోన్లు, అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భద్రతా వ్యవస్థను సమన్వయం చేసేందుకు లాల్‌దర్వాజ యూనియన్ బ్యాంక్ సమీపంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

లాల్‌దర్వాజా బోనాలకు పటిష్ట భద్రత.. ఏఐ కెమెరాలతో నిఘా - Tholi Paluku