Let's talk: editor@tmv.in
లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

Pinjari Chand
17 మార్చి, 2026

గత మూడు రోజులుగా ట్రేడింగ్‌లో తీవ్ర నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం పుంజుకున్నాయి. విలువ ఆధారిత కొనుగోళ్లతో బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాలు నమోదుకావడంతో సూచీలు ఒక శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 938.93 పాయింట్లు లేదా 1.26 శాతం పెరిగి 75,502.85 వద్ద ముగిసింది. రోజు మధ్యలో ఇది గరిష్ఠంగా 75,805.27 వరకు ఎగిసి, కనిష్ఠంగా 73,949.76ను తాకింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 257.70 పాయింట్లు లేదా 1.11 శాతం పెరిగి 23,408.80 వద్ద ముగిసింది.

లాభాల్లో నిలిచిన కంపెనీలు

సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్ 4.22 శాతం పెరిగి అత్యధిక లాభాలు నమోదు చేసింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో పలు ప్రముఖ కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ట్రెంట్, హెచ్‌డీఎఫ్​సీ బ్యాంక్‌, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ లిమిటెడ్, టాటా స్టీల్‌, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియా షేర్లు పెరిగి మార్కెట్‌కు మద్దతు ఇచ్చాయి. ఇక నష్టాల్లో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌లిమిటెడ్‌, సన్ ఫార్మాస్యూటికల్స్‌ ఇండస్ట్రీస్‌, పవర్‌‌ గ్రిడ్‌ కార్పోరేషన్ ఆఫ్‌ ఇండియా, భారతి ఎయిర్‌‌టెల్‌ షేర్లు నిలిచాయి.

రంగాల వారీగా పరిస్థితి

బీఎస్‌ఈ రంగాల సూచీల్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాలు లాభాల్లో ముగిశాయి. అందులో టాప్ 10 బ్యాంక్స్ సూచీ 1.61%, ప్రైవేట్ బ్యాంక్స్ సూచీ 1.38%, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీ 1.32శాతం పెరిగాయి. అయితే ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 2.29 శాతం పడిపోయింది. అలాగే రియాల్టీ, ఎనర్జీ, హెల్త్‌కేర్ రంగాలు కూడా స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

విశ్లేషకుల అభిప్రాయం

మార్కెట్‌ అనలిస్ట్ వినోద్‌ నాయర్‌‌ ప్రకారం, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ వంటి దేశీయ రంగాల్లో విలువ ఆధారిత కొనుగోళ్లతో మార్కెట్ చివరి సెషన్‌లో పుంజుకుంది. ఇటీవల భారీగా పడిపోయిన తర్వాత ఇది ఒక ఉపశమన ర్యాలీగా కనిపిస్తోందన్నారు. మరోవైపు స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అజిత్‌ మిశ్రా మాట్లాడుతూ, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల పెట్టుబడిదారుల్లో జాగ్రత్త భావనను కొనసాగిస్తున్నాయని తెలిపారు. విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు, కరెన్సీ మార్పులు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని అన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లు

ఆసియా మార్కెట్లలో జపాన్‌కు చెందిన నికెయి 225, చైనా ఎస్ఎస్ఈ కంపోజిట్‌ ఇండెక్స్‌లు తగ్గగా, దక్షిణ కొరియా కోస్పి, హాంకాంగ్ హ్యంగ్‌సెంగ్ ఇండెక్స్‌లు లాభాల్లో ముగిశాయి.ప్రపంచ చమురు ప్రమాణంగా పరిగణించే బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 1.41 శాతం పెరిగి 104.4 డాలర్లకు చేరింది. ఇక శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐస్‌) రూ.10,716.64 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐస్‌) రూ.9,977.42 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు ఎక్స్చేంజ్ గణాంకాలు తెలిపాయి.

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు - Tholi Paluku