
లాటిన్ అమెరికాతో బలపడుతున్న భారత్ వాణిజ్య సంబంధాలు
లాటిన్ అమెరికాలోని భాగస్వామ్య దేశాలతో వాణిజ్య సంప్రదింపుల్లో రెండు కీలక దశలను భారత్ ఫలప్రదంగా అధిగమించింది. ఇది ఈ ప్రాంతంతో ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించుకోవాలనీ, వాణిజ్య సంబంధాలను పటిష్ఠపరుచుకోవాలన్న ప్రభుత్వ నిబద్ధతను చాటిచెబుతోంది.
భారత్-పెరూ వాణిజ్య ఒప్పందంలో తొమ్మిదో విడత సంప్రదింపులను ఈ నెల 3 నుంచి 5 వరకూ పెరూలోని లిమాలో నిర్వహించారు. ఈ చర్చల్లో వస్తువులు, సేవలకు సంబంధించిన వాణిజ్యం, మూలాధార నియమాలు (ఒక వస్తువు ఏ దేశంలో తయారైంది అనే విషయాన్ని నిర్ణయించే నియమాలు), వాణిజ్యంలో సాంకేతిక సమస్యలు, కస్టమ్స్ ప్రక్రియలు, వివాద పరిష్కారాలతో పాటు కీలక ఖనిజాలు సహా ప్రతిపాదిత ఒప్పందంలోని కీలక అంశాల్లో చెప్పుకోదగ్గ పురోగతి చోటు చేసుకుంది.
ఈ ఒప్పందం కీలక ఖనిజాలు, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, వస్త్రాలు, ఆహార శుద్ధి వంటి రంగాల్లో సహకారానికి సరికొత్త అవకాశాలను అందిస్తుందని అధికారులు అన్నారు.మలివిడత సంప్రదింపుల్ని 2026 జనవరిలో న్యూఢిల్లీలో నిర్వహించాల్సి ఉండగా పెండింగ్ అంశాల్ని పరిష్కరించుకోవడానికి మరిన్ని సమావేశాల్ని అంతకన్నా ముందే నిర్వహించుకోవడానికి ఇరు పక్షాలూ అంగీకరించాయి.
అంతకు ముందు గత నెల 27 నుంచి 30 వరకూ భారత్-చిలీ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) 3వ విడత సంప్రదింపులను చిలీలోని సాంటియాగోలో నిర్వహించారు. ఈ సందర్భంగా వస్తువులు, సేవలకు సంబంధించిన వాణిజ్యం, పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని అందించడం, మూలాధార నియమాలు , మేధాసంపత్తి హక్కులు, టీబీటీ, ఎస్‌పీఎస్ పరంగా తీసుకోదగిన చర్యలు, ఆర్థిక సహకారం, కీలక ఖనిజాలు సహా అనేక అంశాలపైన చర్చించారు. మార్కెట్ లభ్యత పరిధిని విస్తరించడం, సరఫరా వ్యవస్థను పటిష్ఠంగా ఉండేటట్లు తీర్చిదిద్దడంతో పాటు ఆర్థిక ఏకీకరణను శక్తిమంతం చేయాలన్న ధ్యేయాలతో కూడిన సీఈపీఏ సంప్రదింపుల్ని త్వరగా, నిర్దిష్ట కాలంలో పూర్తి చేయాలని ఇరు పక్షాలూ ఉమ్మడి నిబద్దతను పునరుద్ఘాటించాయి.
పెరూ, చిలీలతో భారత్ వాణిజ్య సంబంధాలు
భారత్, లాటిన్ అమెరికాలోని పెరూ, చిలీ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఇటీవలి సంవత్సరాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రెండు దేశాలు భారత వాణిజ్య వ్యూహంలో కీలక భాగస్వాములుగా మారాయి. భారత్-పెరూ వాణిజ్యం 2024-25లో సుమారు 3 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. భారత్ నుండి పెరూకు ప్రధానంగా ఔషధాలు, ఆటోమొబైల్ భాగాలు, టెక్స్‌టైల్స్, ఆహార ఉత్పత్తులు ఎగుమతి అవుతుండగా, పెరూలో నుండి భారత్‌కు తామ్రం, బంగారం, ఖనిజాలు దిగుమతి అవుతున్నాయి.
భారత్-చిలీ సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి. రెండు దేశాలు 2006లో ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. 2017లో దీన్ని విస్తరించారు. భారత్ నుండి చిలీకి వాహనాలు, ఔషధాలు, వస్త్రాలు ఎగుమతి అవుతుండగా, చిలీ నుండి భారత్‌కు తామ్రం, లిథియం, ఫలాలు, వైన్ ఉత్పత్తులు వస్తున్నాయి.
మొత్తంగా పెరూ, చిలీలతో భారత్ వాణిజ్య భాగస్వామ్యం పెరుగుతున్న తీరు పరస్పర లాభదాయక, సమగ్ర ఆర్థిక సహకారం ద్వారా లాటిన్ అమెరికా ప్రాంతంతో బలమైన భాగస్వామ్యం దిశగా భారత్ వ్యూహాత్మక ముందడుగును సూచిస్తోంది.
