Let's talk: editor@tmv.in
లాజిస్టిక్స్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ - పోర్టులకు రైలు అనుసంధానం

లాజిస్టిక్స్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ - పోర్టులకు రైలు అనుసంధానం

Dantu Vijaya Lakshmi Prasanna
30 జనవరి, 2026

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని ఉద్యానవన ఉత్పత్తులను (దాదాపు 22.5 మిలియన్ మెట్రిక్ టన్నులు) దేశవ్యాప్త మార్కెట్లకు వేగంగా తరలించేందుకు రైల్వే నెట్‌వర్క్ కీలమని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మూలపేట, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం వంటి ప్రధాన ఓడరేవులను మెయిన్ రైల్వే లైన్లతో అనుసంధానించే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ నుంచి సరుకు రవాణా ఏపీ పోర్టుల ద్వారా జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

రాజధాని అమరావతికి హైస్పీడ్ కనెక్టివిటీ

రాష్ట్ర రాజధాని అమరావతిని దక్షిణాదిలోని ప్రధాన నగరాలతో అనుసంధానించేందుకు సీఎం భారీ ప్రణాళికను వెల్లడించారు. ముఖ్యంగా అమరావతి - బెంగళూరు మధ్య చిత్తూరు, తిరుపతి మీదుగా హైస్పీడ్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీనికి సంబంధించి 864 కిలోమీటర్ల మేర సర్వే పూర్తయిందని, సుమారు రూ. 1,90,907 కోట్ల అంచనా వ్యయంతో ఈ కారిడార్ సాధ్యమవుతుందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. అలాగే, రాజధాని ప్రాంతానికి అత్యంత కీలకమైన ఎర్రుపాలెం-నంబూరు రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని, అమరావతిని హైదరాబాద్, చెన్నై నగరాలతో నేరుగా అనుసంధానించాలని అధికారులను కోరారు.

నిర్మాణ దశలో రూ.34,310 కోట్ల విలువైన ప్రాజెక్టులు

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు రైల్ కనెక్టివిటీ పెంచడంపైనా, విజయవాడ బైపాస్, భద్రాచలం రోడ్-కొవ్వూరు సహా రాష్ట్రంలో వివిధ కొత్త రైల్వే మార్గాలపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. హైదరాబాద్-చెన్నయ్, చెన్నయ్-బెంగళూర్, హైదరాబాద్-బెంగళూరు లైన్లను హై స్పీడ్ రైల్వే కారిడార్లుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

ప్రస్తుతం ఏపీలో 2,318 కిలోమీటర్ల పొడవున రూ.34,310 కోట్ల విలువైన మొత్తం 39 కొత్త రైల్వే లైన్ల ప్రాజెక్టులు చేపట్టామని ముఖ్యమంత్రికి రైల్వే అధికారులు వివరించారు. ఈ ఏడాది 201 కిలోమీటర్ల రైల్వే లైన్‌ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రైల్వే రూట్ డెన్సిటీ పరంగా రాష్ట్రంలో ప్రతీ వెయ్యి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి ఏపీలో 24.82 కిలోమీటర్ల మేర మాత్రమే రైల్వే లైన్లు ఉన్నాయని, తమిళనాడుతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. రాయలసీమను కోస్తా జిల్లాలతో అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని సూచించారు.

పారిశ్రామికాభివృద్ధి, కొత్త రైల్వే లైన్లు

రాష్ట్రంలో పారిశ్రామిక రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు ఇచ్చాపురం నుండి తడ వరకు నాలుగు రైల్వే లైన్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. దీనిపై తక్షణమే డీపీఆర్ సిద్ధం చేసి, మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు. తిరుపతి-రేణిగుంట ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో అక్కడ మెరుగైన రైలు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రాయలసీమ, కోస్తా ఆంధ్ర మధ్య కనెక్టివిటీని పెంచడం ద్వారా రద్దీ తగ్గించడమే కాకుండా, కడప-బెంగళూరు బ్రాడ్ గేజ్ లైన్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

అమృత్ భారత్ స్టేషన్లు, పుష్కరాల ఏర్పాట్లు

రాష్ట్రంలోని 73 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద 2027 నాటికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా రాజమహేంద్రవరం స్టేషన్‌ను, అలాగే 2028 కృష్ణా పుష్కరాల కోసం విజయవాడ స్టేషన్‌ను (పిపిపి పద్ధతిలో) ఆధునీకరించాలని సూచించారు . రాష్ట్రంలో ప్రస్తుతం 808 వరకూ ఉన్న రైల్వే క్రాసింగ్స్‌కు పరిష్కారం చూపేలా, రైల్వే లెవల్ క్రాసింగ్స్ ఇబ్బందులు లేకుండా ఆర్వోబీ, ఆర్‌యూబీల నిర్మాణం చేపట్టాలని సీఎం చెప్పారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ 2029 మార్చి కల్లా పూర్తి చేయాలన్నారు.

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రైల్వే శాఖ ఇప్పటి నుంచే సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా 1,012 ప్రత్యేక రైల్ సర్వీసులను నడిపేందుకు, 2,370 రైల్వే కోచ్‌లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు రైల్వే అధికారులు సిఎంకు వివరించారు.

ఈ సమీక్షకు దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, రాష్ట్ర రవాణా, ఆర్ధిక, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.