Let's talk: editor@tmv.in
లాంబోర్గిని ప్రమాదం కేసులో శివంమిశ్రాకు బెయిల్

లాంబోర్గిని ప్రమాదం కేసులో శివంమిశ్రాకు బెయిల్

Pinjari Chand
13 ఫిబ్రవరి, 2026

కాన్పూర్‌లో జరిగిన లాంబోర్గిని కారు ప్రమాద ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివం మిశ్రాకు జిల్లా కోర్టు గురువారం రూ.20,000 వ్యక్తిగత బాండ్‌పై బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల రిమాండ్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిన అనంతరం బెయిల్ మంజూరైంది. శివం మిశ్రా తరఫు న్యాయవాది నరేష్ చంద్ర త్రిపాఠి మాట్లాడుతూ, కోర్టు రిమాండ్‌ను నిరాకరించింది. రూ.20,000 అండర్‌టేకింగ్, వ్యక్తిగత బాండ్‌పై ఆయన విడుదలవుతున్నారు. పోలీసులు ప్రభుత్వ ఒత్తిడిలో పనిచేస్తూ ఆయనను తప్పుగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. మరో న్యాయవాది మృత్యుంజయ్ కుమార్ కూడా కోర్టు రిమాండ్ పిటిషన్‌ను తిరస్కరించిందని తెలిపారు.

పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రాను, తన డ్రైవర్ మోహన్ తానే వాహనం నడిపానని చెప్పినప్పటికీ కోర్టు అంగీకరించకపోవడంతో గురువారం అరెస్ట్ చేశారు.

ఫిబ్రవరి 8న మధ్యాహ్నం ఝులా పార్క్ క్రాసింగ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లాంబోర్గిని కారు ముందుగా ఆటోరిక్షాను, తరువాత బుల్లెట్ మోటార్‌సైకిల్‌ను ఢీకొని చివరకు ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. కారు అధిక వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రాథమిక ఎఫ్‌ఐఆర్‌లో అజ్ఞాత డ్రైవర్ గా కేసు నమోదు చేసిన పోలీసులు, తరువాత సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా శివం మిశ్రా పేరును చేర్చారు.

అయితే, డ్రైవర్ మోహన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తానే కారు నడిపానని అంగీకరించాడు. శివం మిశ్రా పక్క సీటులో కూర్చున్నారని, అకస్మాత్తుగా ఆయనకు పట్టు (సీజర్) వచ్చి తనపై పడడంతో వాహనం నియంత్రణ తప్పిందని చెప్పాడు. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. ప్రమాదం సమయంలోనే బౌన్సర్ నన్ను కారులో నుంచి బయటకు తీశాడని పేర్కొన్నాడు. శివం మిశ్రా తరఫు న్యాయవాది నరేంద్ర కుమార్ యాదవ్ మాట్లాడుతూ, డ్రైవర్ మోహన్ ప్రమాదానికి తానే కారణమని అఫిడవిట్ సమర్పించాడని తెలిపారు. శివం మిశ్రాను పోలీసులు తప్పుగా అరెస్ట్ చేశారు. ఆయన వాహనం నడపలేదని యాదవ్ చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.