Let's talk: editor@tmv.in
లాంబోర్గిని నడిపింది నా కుమారుడు కాదు: శివమ్ మిశ్రా తండ్రి

లాంబోర్గిని నడిపింది నా కుమారుడు కాదు: శివమ్ మిశ్రా తండ్రి

Pinjari Chand
11 ఫిబ్రవరి, 2026

కాన్పూర్‌ వీఐపీ రోడ్డులో జరిగిన లాంబోర్గిని కారు ప్రమాదంలో తమ కుమారుడు శివమ్‌ మిశ్రానే వాహనం నడిపాడన్న పోలీసుల వాదనను ఆయన తండ్రి కేకే మిశ్రా ఖండించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది డ్రైవరేనని, శివమ్‌ అనారోగ్యంతో స్పృహ తప్పి ఉన్నాడని ఆయన తెలిపారు. గ్వాల్టోలి పోలీస్‌ స్టేషన్‌ వద్ద మీడియాతో మాట్లాడిన కేకే మిశ్రా, ప్రమాద సమయంలో కారులో శివమ్‌తో పాటు డ్రైవర్‌ కూడా ఉన్నాడని చెప్పారు. ప్రమాదానికి ముందు రోజు లాంబోర్గినీలో సాంకేతిక సమస్య తలెత్తిందని, మెకానిక్కులు దాన్ని బాగు చేసిన అనంతరం మరుసటి రోజు వాహనాన్ని పరీక్షించేందుకు శివమ్‌, డ్రైవర్‌ బయటకు వెళ్లారని వివరించారు. సివిల్‌ లైన్స్‌ నుంచి తిరిగి వస్తుండగా శివమ్‌కు అకస్మాత్తుగా స్పృహ తప్పిందని, డ్రైవర్‌ అతడిని చూసేందుకు ఒక చేతిని స్టీరింగ్‌ నుంచి తీసుకోవడంతో కారు వేగం తగ్గిందని చెప్పారు. అదే సమయంలో ఓ ఆటోరిక్షా వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. కారు ఆటోమేటిక్‌గా లాక్‌ కావడంతో డ్రైవర్‌ తలుపు తెరవలేకపోయాడని, అనంతరం భద్రతా సిబ్బంది అద్దాన్ని పగలగొట్టి శివమ్‌ను బయటకు తీసినట్టు వివరించారు.

ప్రమాదం తర్వాత ఇంటికి వచ్చిన శివమ్‌ను డాక్టర్‌ పరీక్షించారని, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించామని కేకే మిశ్రా చెప్పారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతున్నారని, మరో రెండు మూడు రోజుల్లో ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని వైద్యులు తెలిపినట్టు పేర్కొన్నారు. శివమ్‌నే కారు నడిపాడని కాన్పూర్‌ పోలీస్‌ కమిషనర్‌ చేసిన వ్యాఖ్యలను కేకే మిశ్రా తీవ్రంగా ఖండించారు. తమ కుటుంబంలో ఎవరూ మద్యం లేదా మత్తు పదార్థాలు ముట్టుకోరని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా శివమ్‌ మిశ్రా తరఫు న్యాయవాది ధర్మేంద్ర సింగ్‌ ధర్ము కూడా కారు నడిపింది డ్రైవర్‌ మోహన్‌నేనని తెలిపారు. మోహన్‌ కోర్టులో లొంగిపోవడానికి దరఖాస్తు చేసుకున్నాడని, బెయిల్‌తో పాటు కారును విడుదల చేయాలని కోరుతున్నట్టు చెప్పారు. ప్రమాద సమయంలో శివమ్‌, డ్రైవర్‌ ఇద్దరూ కారులో ఉన్నారని వెల్లడించారు.

శివమ్ మిశ్రానే నడిపినట్టు తేల్చిన సీసీటీవీ ఫుటేజ్

మరోవైపు కాన్పూర్‌ పోలీస్‌ కమిషనర్‌ రఘుబీర్‌ లాల్‌ ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, సీసీటీవీ ఫుటేజ్‌ సహా అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం శివమ్‌ మిశ్రానే కారు నడిపినట్టు నిర్ధారణకు వచ్చామని తెలిపారు. అందుకే ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్టు చెప్పారు. శివమ్‌ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టామని, ఆయన ఆసుపత్రిలో ఉన్నట్టు సమాచారం అందిందని పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా ఆయన తండ్రికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఈ ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం జులా పార్క్‌ క్రాసింగ్‌ సమీపంలో చోటుచేసుకుంది. లాంబోర్గిని కారు ఓ ఆటోరిక్షాను, బుల్లెట్‌ మోటార్‌ సైకిల్‌ను ఢీకొని చివరకు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)–2023లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని డీసీపీ అతుల్‌కుమార్‌ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.