Let's talk: editor@tmv.in
లేహ్​లో పరిస్థితి ఉద్రిక్తం

లేహ్​లో పరిస్థితి ఉద్రిక్తం

Pinjari Chand
25 సెప్టెంబర్, 2025

లడఖ్​ కు రాష్ట్ర హోదా ఇవ్వాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్​ లో చేర్చాలని డిమాండ్​ చేస్తూ బుధవారం లడఖ్​ ప్రజలు భారీ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిపై లాఠీలు ఝుళిపించారు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆందోళనకారులు లేహ్​ లోని బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా లడఖ్​ కు రాష్ట్ర హోదా కోసం 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్​ వాంగ్ చుక్​ ఓ వీడియో విడుదల చేశారు. ఈ ప్రాంతంలో నిరసనకారులు అనేక కార్యలయాలను,పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారని తెలిసింది. దయచేసి ఇలా చేయవద్దు. అర్ధం లేని ఆవేశాల వల్ల మనమే తీవ్రంగా నష్టపోతామని సూచించారు. ఇలా చేస్తే మన లక్ష్యం దెబ్బతింటుందని తెలిపారు. ఇక్కడ శాంతి నెలకొనాలని నేను కోరుకుంటున్నాను. యువత ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మేం హింసను ఖండిస్తున్నాం. ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోవడం దురదృష్టం. జమ్మూ కశ్మీర్​, అదేవిధంగా లడఖ్​ విషయంలో కేంద్రం సరైన రీతిలో న్యాయం చేయలేదు. వారు ఢిల్లీలో ఉంటే సరిపోదు. ఇక్కడికి వచ్చి ప్రజలతో కూర్చొని మాట్లాడాలి’ అని నేషనల్​ కాన్ఫరెన్స్​ ఎమ్మెల్యే తన్వీర్ సాధిక్ అన్నారు. జమ్మూ కశ్మీర్​ కు రాష్ట్ర హోదా ఇవ్వడంలో జాప్యం చేయడమంటే ప్రజలకు అన్యాయం చేయడమేనని కేంద్రప్రభుత్వాన్ని సీఎం ఒమర్​ అబ్దుల్లా విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఈ సమస్యను బీజేపీ ఆలస్యం చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో ఉన్న 244(2), 275(1) ఆర్టికల్స్​ అస్సాం, మేఘాలయ, త్రిపుర మిజోరం రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించినవి. అలాగే జమ్మూలో 370 ఆర్టికల్ రద్దు చేసినప్పటి నుంచి రాష్ట్ర హోదా డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈరోజు ఘర్షణ వాతావరణం నెలకొనడంతో వాంగ్​ చుక్​ దీక్షను విరమించారు.

లేహ్​లో పరిస్థితి ఉద్రిక్తం - Tholi Paluku