
‘లవ్ జిహాద్’ కాదు.. మేము మతం మార్చుకోలేదు’:మోనాలిసా
గత ఏడాది కుంభమేళాలో వైరల్‌గా మారిన యువతి మోనాలిసా భోంస్లే తన పెళ్లిపై వస్తున్న ‘లవ్ జిహాద్’ ఆరోపణలను ఖండించారు. కేరళలో ఒక ముస్లిం యువకుడితో జరిగిన తన వివాహం పూర్తిగా తన ఇష్టంతోనే జరిగిందని, అది హిందూ సంప్రదాయాల ప్రకారమే జరిగిందని ఆమె గురువారం తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా భోంస్లే మీడియాతో మాట్లాడుతూ తాము ఎవ్వరూ మతం మార్చుకోలేదని స్పష్టం చేశారు. ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి మొదట సిద్ధంగా లేరు. నేనే ఒత్తిడి చేసి పెళ్లి చేసుకున్నాను. మా వివాహం హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిందని ఆమె చెప్పారు. ఈ వివాహాన్ని కొంతమంది మీడియా సంస్థలు ‘లవ్ జిహాద్’గా పేర్కొనడం తప్పని వారు తెలిపారు. కళాకారులుగా తమకు అన్ని మతాలు సమానమని, అందుకే తాము ఎలాంటి మత మార్పిడి చేయలేదని వారు స్పష్టం చేశారు. ‘లవ్ జిహాద్’ అనే పదాన్ని కొందరు రైటిస్ట్ సంస్థలు ముస్లిం పురుషులు హిందూ మహిళలను ప్రేమలో పడేసి వివాహం ద్వారా మత మార్పిడి చేయించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించడానికి ఉపయోగిస్తుంటాయి.
మోనాలిసా భర్త కూడా మాట్లాడుతూ ప్రేమలో ఉన్నప్పుడు మతం మార్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆమె పుట్టిన తేదీ 2008 జనవరి 1 అని చెబుతూ తన మొబైల్‌లో ఉన్న ఆధార్ కార్డు, జనన సర్టిఫికేట్ కాపీలను కూడా మీడియాకు చూపించారు. తమ వివాహ నమోదు పత్రాలు కూడా చూపించారు. తాను మోనాలిసాను ప్రేమిస్తున్నందుకే హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నానని ఆయన తెలిపారు. నలుగురి సంతానంలో పెద్దది అయిన మోనాలిసా మాట్లాడుతూ తన తల్లిదండ్రులు పిన్ని కుమారుడితో పెళ్లి చేయాలని కోరుకున్నారని చెప్పారు.అతను నాకు అన్నలాంటివాడు. నేను అతనిని ఎలా పెళ్లి చేసుకుంటాను? అని ఆమె ప్రశ్నించారు. తన తండ్రి ప్రస్తుతం కేరళలోనే ఉన్నప్పటికీ, తమ వివాహానికి హాజరుకాలేదని తెలిపారు. ఈ విషయం వల్ల ఆయన కోపంగా ఉన్నారని చెప్పారు. కాలక్రమంలో ఆయనను ఒప్పిస్తామని ఆమె భర్త అన్నారు. తనకు ఒక చెల్లి, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారని మోనాలిసా చెప్పారు.
వృత్తి గురించి అడిగినప్పుడు ఆమె భర్త మాట్లాడుతూ సినిమా పనుల కోసం తరచూ కేరళ, చెన్నైలకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. కొన్ని తమిళ చిత్రాల్లో పనిచేసినట్లు తెలిపారు. గత ఒకన్నర సంవత్సరంగా తాను తిరువనంతపురంలోనే ఉంటున్నానన్నారు. తమ వివాహం జరగడంలో సహకరించిన గవర్నమెంట్ ఆఫ్ కేరళ, పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
నాకు 18 ఏళ్లు నిండాయి
తాను 18 ఏళ్లకు పైనే వయస్సుందని మోనాలిసా చెప్పారు. తమ వివాహం రిజిస్టర్ అయిందని, తాను మైనర్ అయితే అది సాధ్యమయ్యేదే కాదని ఆమె భర్త అన్నారు. ఆమె వయస్సు గురించి వస్తున్న వార్తలు తప్పుడు, అసత్యం అని ఇద్దరూ పేర్కొన్నారు. ఇక భవిష్యత్తులో కేరళలోనే ఉండాలా అనే ప్రశ్నకు, అది తన భార్య నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. మోనాలిసా మాత్రం కేరళ తనకు నచ్చిందని, ఇక్కడే ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యిందని, మరో సినిమా చిత్రీకరణ కొనసాగుతోందని చెప్పారు. ఇద్దరూ ఆరు నెలల క్రితం ఒక సినిమా కోసం ఎంపికైనప్పుడు పరిచయం అయి ప్రేమలో పడ్డామని ఆమె భర్త తెలిపారు. ఆ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదని చెప్పారు. ఈ జంట బుధవారం నయనర్ దేవాలయంలో వివాహం చేసుకుంది. ఈ కార్యక్రమానికి కేరళ విద్యాశాఖ మంత్రి శివన్‌కుట్టి, గోవిందన్,రాజ్యసభ సభ్యుడు ఏఏ.రహీం సహా పలువురు నాయకులు హాజరయ్యారు. తమ సంబంధాన్ని కుటుంబ సభ్యులు ఇష్టపడకపోవడంతో మరో వ్యక్తితో పెళ్లి చేయాలని ఒత్తిడి చేశారని మోనాలిసా చెప్పారు. బుధవారం ఆమె తండ్రి బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఈ జంట తంపనూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లినట్లు సమాచారం.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా భోంస్లే గత ఏడాది కుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో రుద్రాక్ష మాలలు విక్రయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా ప్రసిద్ధి చెందారు. ఆమె చిరునవ్వు, కళ్ల ఆకర్షణతో ఆ వీడియో విస్తృతంగా పాపులర్ అయింది.
