Let's talk: editor@tmv.in
లలితగిరిలో 3వ శతాబ్దపు అరుదైన బౌద్ధ అవశేషం ప్రదర్శన

లలితగిరిలో 3వ శతాబ్దపు అరుదైన బౌద్ధ అవశేషం ప్రదర్శన

Dantu Vijaya Lakshmi Prasanna
21 జనవరి, 2026

ఒడిశాలోని ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం లలితగిరిలో అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందిన అత్యంత పవిత్రమైన బౌద్ధ అవశేషాన్ని సుమారు రెండు వేల ఏళ్ల తర్వాత ప్రజల సందర్శనార్థం మ్యూజియం వెలుపలకు తీసుకువచ్చారు. దాదాపు 2,300 ఏళ్ల క్రితం నాటి పవిత్ర బౌద్ధ అవశేషం మ్యూజియం చీకటి గదుల నుండి బయటకు వచ్చి, లోకానికి దర్శనమిచ్చిందని, మంగళవారం జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో తెలిపారు.

గురు పద్మసంభవ ఉత్సవాల సందర్భంగా బయటకు …

జనవరి 16న లలితగిరిలో జరిగిన రెండవ 'గురు పద్మసంభవ' ఉత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. వజ్రయాన బౌద్ధమత వ్యాప్తికి విశేష కృషి చేసిన గురు పద్మసంభవ జ్ఞాపకార్థం ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవిదేశాల నుండి తరలివచ్చిన బౌద్ధ భిక్షువులు, పండితులు, భక్తులు ఈ పవిత్ర అవశేషాన్ని దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించారు.

భారత పురావస్తు శాఖ ధ్రువీకరణ ప్రకారం, ఈ అవశేషం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందినది. సాధారణంగా ఇవి అత్యంత కట్టుదిట్టమైన భద్రత, శాస్త్రీయ సంరక్షణ మధ్య మ్యూజియం గదుల్లోనే ఉంటాయి. అయితే, భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, ఏఎస్ఐ సంయుక్తంగా ఈ అరుదైన అవకాశాన్ని కల్పించాయి.

"ఈ ప్రదర్శన ద్వారా లలితగిరి ప్రాముఖ్యత ప్రపంచ బౌద్ధ పటంలో మరోసారి వెలుగులోకి వచ్చింది. పురాతన బౌద్ధ నాగరికతను, వారసత్వ సంపదను కాపాడటంలో ఒడిశా ముందుంటుంది." అని ఒడిశా భాష, సాహిత్యం & సంస్కృతి శాఖ మంత్రి సూర్యబన్షీ సూరజ్ అన్నారు.

కాగా, భారత పురావస్తు శాఖ 1985లో లలితగిరిలోని 'మహాస్థూపం' వద్ద జరిపిన తవ్వకాల్లో మూడు ఖండాలైట్ రాతితో చేసిన పేటికలు లభ్యమయ్యాయి. ఇవి స్థూపానికి దక్షిణం, తూర్పు, ఉత్తర దిశలలో లభించాయి. ఈ మూడు రాతి పేటికలలో రెండింటి లోపల విభిన్న లోహాలతో చేసిన చిన్న పేటికలు ఒకదానిలో ఒకటి అమర్చబడి ఉన్నాయి. బయట రాతి పేటిక, దాని లోపల వెండి పేటిక, ఆ వెండి పేటిక లోపల బంగారు పేటిక ఉన్నాయి. ఒక బంగారు పేటికలో బంగారు రేకుతో చుట్టబడిన ఒక చిన్న ఎముక ముక్క ఉండగా, రెండవ బంగారు పేటికలో చుట్టబడని ఎముక ముక్క లభించింది. మూడవ రాతి పేటిక ఖాళీగా ఉంది.

లలితగిరిలో లభించినట్లే, భారతదేశంలోని మరికొన్ని ప్రధాన బౌద్ధ క్షేత్రాలలో కూడా ఇటువంటి ధాతు పేటికలు లభించాయి. బీహార్ లోని వైశాలి, ఉత్తరప్రదేశ్ లోని సారనాథ్, గణ్వేరీవాలా (కపిలవస్తు), మధ్యప్రదేశ్ లోని సాంచి, ఆంధ్రప్రదేశ్ లో అమరావతి, నాగార్జునకొండ ఇందుకు సజీవ సాక్ష్యాలు.

భద్రత, సమన్వయం

అవశేషం భద్రత విషయంలో రాజీ పడకుండా, పురావస్తు శాఖ నిబంధనలకు లోబడి ఈ కార్యక్రమం జరిగింది. పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖల సమన్వయంతో, కట్టుదిట్టమైన భద్రత నడుమ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దీనివల్ల ఒడిశాలోని బౌద్ధ పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

వజ్రయాన బౌద్ధం అంటే ఏమిటి?

ఈ ఉత్సవం ముఖ్యంగా వజ్రయాన శాఖకు సంబంధించింది. బౌద్ధమతంలో ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. హీనయాన, మహాయాన, వజ్రయాన. 'వజ్ర' అంటే విడదీయలేనిది లేదా కఠినమైనది అని అర్థం. మనిషిలోని అజ్ఞానాన్ని వజ్రంలాంటి జ్ఞానంతో ఛేదించడమే దీని పరమార్థం. వజ్రయానంలో ధ్యానంతో పాటు ముద్రలు (చేతి కదలికలు), మంత్రాలు, తంత్ర విద్యలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇది మనిషిని త్వరగా జ్ఞానోదయం వైపు నడిపిస్తుందని నమ్ముతారు.

గురు పద్మసంభవ: రెండవ బుద్ధుడు

ఈ ఉత్సవం గురు పద్మసంభవ (గురు రింపోచే అని కూడా పిలుస్తారు) గౌరవార్థం జరిగింది. ఆయన ఎనిమిదవ శతాబ్దంలో ఒడిశా (అప్పటి ఉడ్యాన) ప్రాంతంలో జన్మించారని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. టిబెట్ రాజు ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్లి, అక్కడ ఉన్న ప్రతికూల శక్తులను అంతం చేసి బౌద్ధమతాన్ని స్థాపించారు. అందుకే టిబెట్ ప్రజలు ఆయన్ని "రెండవ బుద్ధుడు" అని కొలుస్తారు. ఆయన కరుణ, సంపూర్ణ అవగాహన, లోతైన ఆధ్యాత్మిక సాధన గురించి బోధించారు. లలితగిరిలో ఆయన విగ్రహాలు, అవశేషాలు ఉండటం ఒడిశాకు ఆయనతో ఉన్న విడదీయరాని బంధాన్ని సూచిస్తుంది.

‘సాఫ్ట్ పవర్’ గా బౌద్ధమతం

నేడు భారతదేశం ప్రపంచ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో బౌద్ధమతం ఒక కీలకమైన 'సాఫ్ట్ పవర్' (సాంస్కృతిక శక్తి) గా పనిచేస్తోంది. శ్రీలంక, థాయ్‌లాండ్, జపాన్, భూటాన్, మయన్మార్, వియత్నాం వంటి ఆసియా దేశాలతో అనుసంధానం జరిగి ఈ దేశాలన్నీ బౌద్ధ వారసత్వాన్ని పంచుకుంటాయి. లలితగిరిలో జరిగిన ఈ ప్రదర్శన కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ఆయా దేశాలతో భారతదేశానికి ఉన్న పురాతన బంధాన్ని గుర్తు చేసే ఒక ప్రయత్నం.

పర్యాటక రంగం అభివృద్ది కోసం ప్రభుత్వం "బౌద్ధ సర్క్యూట్" ద్వారా విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. దీనివల్ల ఆర్థిక సంబంధాలతో పాటు సాంస్కృతిక గౌరవం కూడా పెరుగుతుంది. యుద్ధాలు, ఘర్షణలు జరుగుతున్న నేటి ప్రపంచంలో బుద్ధుని అహింసా సిద్ధాంతం భారతదేశాన్ని ఒక 'విశ్వగురువు'గా నిలబెడుతోంది.

లలితగిరి మ్యూజియం నుండి ఆ పవిత్ర అవశేషాన్ని బయటకు తీసుకువచ్చినప్పుడు, అక్కడ ఉన్న విదేశీ ప్రతినిధులు, భిక్షువులు కళ్లలో నీళ్లు తిరుగుతుండగా నమస్కరించారు. అది కేవలం ఒక పురాతన వస్తువు కాదు. అది శాంతికి, కరుణకు వేల ఏళ్ల భారతీయ జ్ఞానానికి నిదర్శనం. ఒడిశా మంత్రి సూర్యబన్షీ సూరజ్ చెప్పినట్లుగా, ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం తన ప్రాచీన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.