Let's talk: editor@tmv.in
లడ్డు విషయంలో చంద్రబాబుపై చర్యలు తీసుకోండి: వెల్లంపల్లి శ్రీనివాసరావు

లడ్డు విషయంలో చంద్రబాబుపై చర్యలు తీసుకోండి: వెల్లంపల్లి శ్రీనివాసరావు

Panthagani Anusha
4 ఫిబ్రవరి, 2026

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో అసత్య ఆరోపణలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం విజయవాడ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సిట్ నివేదికలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టమైనా, రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన ప్రసాదాన్ని కించపరిచేలా పాలకులు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.

తిరుమల లడ్డూలో జంతు కొవ్వు, చేప నూనె కలిపారంటూ గతంలో చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ కుట్రేనని వెల్లంపల్లి విమర్శించారు. నిజానిజాలు నివేదికల ద్వారా బయటకు వచ్చినా ఇంకా అబద్ధాలను ప్రచారం చేస్తూ భక్తులను అయోమయానికి గురిచేస్తున్నారు. ఇది వేంకటేశ్వర స్వామి పట్ల వారికి ఉన్న భక్తి లేమిని సూచిస్తోంది అని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పద్ధతులనే అనుసరిస్తూ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

లా అండ్ ఆర్డర్ విఫలం.. కక్ష సాధింపులే లక్ష్యం

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై వెల్లంపల్లి తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడులు చేసినా, హత్యాయత్నం కేసులు నమోదు చేయకుండా నిందితులకు సులభంగా బెయిల్ వచ్చేలా ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లకు రక్షణ కల్పించాల్సింది పోయి, దాడులు చేసే టీడీపీ నేతల ఇళ్లకు భద్రత పెంచడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఢిల్లీలో ఎంపీ కేశినేని చిన్ని అవినీతికి పాల్పడినా పట్టించుకోని యంత్రాంగం, ప్రతిపక్ష నేతలపై మాత్రం ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు.

పవిత్రమైన తిరుమల లడ్డూపై విషప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలతో సమాజంలో అశాంతి రేకెత్తించే వారిని వదిలిపెట్టకూడదని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.