
లడ్డు కల్తీ నివేదికపై సర్కార్ నజర్:విచారణ కమిటీకి అదనపు బలగం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నేతృత్వంలోని ప్రత్యేక విచారణ బృందం (సిట్) తన నివేదికను సమర్పించిన నేపథ్యంలో దోషులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సిట్ విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా, బాధ్యులపై శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలను సిఫార్సు చేసేందుకు ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఒక సభ్యుని కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కమిటీ పనితీరును మరింత వేగవంతం చేసేందుకు పరిపాలనా పరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం తాజాగా ముగ్గురు సహాయక అధికారులను నియమించింది. రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి మునీంద్రను కమిటీకి ప్రత్యేక బాధ్యతల అధికారి (ఓఎస్డీ)గా నియమించగా రిటైర్డ్ అసిస్టెంట్ సెక్రటరీ పి.బి.వి.ఎస్.ఎస్. శివకుమార్‌ను వ్యక్తిగత కార్యదర్శిగా నియమించారు. అదేవిధంగా రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజిఎస్) నుండి డి.సి. మధురిని కమిటీకి సాంకేతిక పరిపాలనా సహాయం అందించేందుకు డిప్యూటేషన్‌పై పంపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
సిట్ తన విచారణను పూర్తి చేసి జనవరి 23న కోర్టుకు ఛార్జీషీట్ సమర్పించడంతో పాటు ప్రభుత్వానికి ఒక 'సెల్ఫ్ కంటైన్డ్ నోట్' ను కూడా అందజేసింది. లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి నాణ్యత విషయంలో అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు సంబంధిత కమిటీ సభ్యుల పాత్రపై ఈ నోట్‌లో కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నివేదికలో సూచించిన అంశాలను దినేష్ కుమార్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ప్రభుత్వానికి అధికారికంగా సిఫార్సు చేయనుంది.
ఇక ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు టీటీడీ పాలనా వ్యవస్థలో భారీ మార్పులకు సంకేతంగా మారుతున్నాయి. లడ్డు తయారీ విధానం ముడిసరుకుల సేకరణలో పారదర్శకతను పెంచడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. త్వరలోనే ఈ కమిటీ తుది నివేదికను అందజేయనుండటంతో టీటీడీ మాజీ ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ నెలకొంది.
