
లడాఖ్‌కు సమాన హక్కులు కల్పించాలి: సోనమ్ వాంగ్‌చుక్
లడాఖ్‌కు ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కులు కల్పించాలని కోరుతూ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కార్గిల్‌లో నిర్వహించిన సభలో ఐక్యతకు పిలుపునిచ్చారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన మొదటిసారిగా కార్గిల్‌కు వచ్చిన సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద జోధ్‌పూర్ జైలులో దాదాపు ఆరు నెలలు నిర్బంధంలో ఉన్న వాంగ్చుక్ మార్చి 14న విడుదలయ్యారు. ఆయన భార్య సుప్రీంకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం నిర్బంధానికి ఉన్న కారణాలను ఉపసంహరించుకుంది. లడాఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ అమలు వంటి డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తున్న కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్, లేహ్ అపెక్స్ బాడీ నేతలు వాంగ్చుక్‌కు స్వాగతం పలికారు.
మనల్ని కలిపేది మానవత్వమే
ఈ సందర్భంగా వాంగ్చుక్ మాట్లాడుతూ లడాఖ్ ప్రజలు మతం, ప్రాంతం అనే విభేదాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మనలను కలిపేది మానవత్వం, భారతీయులమనే భావన. మతం లేదా వర్గాల ఆధారంగా విభజించుకోకుండా ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. లడాఖ్‌కు ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, స్థానిక వనరులపై హక్కులు ఇతర రాష్ట్రాల మాదిరిగానే కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేహ్, కార్గిల్ ప్రాంతాల మధ్య ఐక్యత ఉద్యమానికి బలాన్ని ఇచ్చిందని చెప్పారు. తన నిర్బంధాన్ని ఆయన కఠిన అనుభవంగా పేర్కొన్నప్పటికీ, లడాఖ్ కోసం జరిగిన పోరాటంలో అది విలువైన అనుభవమని అన్నారు. ఇది సులభం కాదు. కానీ లడాఖ్ ప్రయోజనాల కోసం అయితే అది విలువైన అనుభవమే. ముందుకు కొత్త ఉదయం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
కేసులను ఉపసంహరించుకోవాలి
లడాఖ్ ఎంపీ హనీఫా జాన్ మాట్లాడుతూ వాంగ్చుక్ విడుదలను సత్యం, నిజాయితీ సాధించిన విజయంగా అభివర్ణించారు. సమస్యలకు పరిష్కారం కోసం ప్రభుత్వం నిజాయితీగా చర్చలు ప్రారంభించాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా త్వరగా చర్చలను పునఃప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా లడాఖ్ ప్రజలు తమ డిమాండ్లను వ్యక్తం చేస్తున్నప్పటికీ స్పష్టమైన పరిష్కారం రాలేదని పేర్కొన్నారు. చెరింగ్ డోర్జే మాట్లాడుతూ వాంగ్చుక్ విడుదల ప్రభుత్వ కృప వల్ల కాదని, న్యాయపరమైన ఒత్తిడితో జరిగినదని అన్నారు. ఆయనపై పెట్టిన తీవ్ర ఆరోపణలు తర్వాత ఉపసంహరించుకున్నాయని పేర్కొన్నారు. లేహ్‌లో సెప్టెంబర్ 24న జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత సుమారు 80 మంది కార్యకర్తలు జైలుకు వెళ్లారని, వారిపై ఉన్న కేసులను ఇంకా పూర్తిగా ఉపసంహరించలేదని ఆయన తెలిపారు.
