
లడఖ్ హింసకు కారణం ఏమిటి?
లడఖ్, దేశంలో అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి. చైనా సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో ఇటీవల హింస చెలరేగింది. ఈ హింసలో మొత్తం నలుగురు పౌరులు మరణించగా, 60 మందికిపైగా గాయపడ్డారు. బీజేపీ కార్యాలయంపై దాడి జరిగింది. తమకు పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలని.. ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి.
హింసకు అసలు కారణం ఏమిటి?
2019లో జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి లడఖ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు 2020 నుండి ఊపందుకున్నాయి. కానీ ఇటీవల ఇది హింసాత్మక రూపం దాల్చింది. లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినప్పటికీ, దానికి పూర్తి స్వతంత్రత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమకు భూమి, ఉద్యోగాల్లో సమానమైన హక్కులు దక్కడం లేదని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లడఖ్‌లో బయట వ్యక్తులు పెట్టుబడులు పెట్టడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ను (అస్సాం, మేఘాలయా వంటి రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలకు) లడఖ్‌కు వర్తింపజేయాలని కోరుకుంటున్నారు.
జెన్ జడ్ యువత ద్వారా ఉద్యమం
ప్రస్తుతం లడఖ్‌లో జరుగుతున్న ఉద్యమం జెన్ జడ్ యువత (18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉన్న యువత) తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా వీరంతా ఏకమై ఉద్యమానికి సన్నద్ధమైనట్టు సమాచారం. డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. లడఖ్‌కు స్వతంత్ర రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఆరో షెడ్యూల్‌ను వర్తింప జేయాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. సెప్టెంబర్ 10న మొదలైన ఈ నిరాహార దీక్ష తాజాగా హింసారూపం దాల్చింది. అయితే వాంగ్ చుక్ అక్కడి యువతను రెచ్చగొడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఎవరీ సోనమ్ వాంగ్ చుక్
సోనమ్ వాంగ్ చుక్ లడఖ్‌కు చెందిన ప్రముఖ ఇంజినీర్, ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ వేత్త కూడా. 1966లో జన్మించిన ఈయన స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్స్కూల్ స్థాపకుడు. స్థానిక విద్యార్థులకు పర్యావరణ ఆధారిత విద్యను అందిస్తాడు. 2018లో రామన్ మొగసేసే అవార్డు పొందారు. 2013లో విడుదలైన '3 ఇడియట్స్' సినిమా జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగానే తెరకెక్కింది. ఆయన లడఖ్ హక్కుల కోసం మూడేళ్లలో ఐదుసార్లు నిరాహార దీక్షలు చేపట్టి ఉద్యమించారు.
వాంగ్ చుక్ ప్రధాన డిమాండ్లు ఏమిటి?
లడఖ్‌కు పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. లడఖ్‌కు స్వతంత్ర లెజిస్లేచర్, బడ్జెట్ హక్కులు. ఆరో షెడ్యూల్ చేర్చాలని, గిరిజన భూములను రక్షించాలని కోరుతున్నారు. స్థానిక ఉద్యోగ కోటాలు (ప్రస్తుతం 45% నుండి 84%కి పెంచాలని). భూమి, సాంస్కృతిక రక్షణను ఆయన డిమాండ్ చేస్తున్నారు. స్థానిక భాషలను గుర్తించాలని కోరుతున్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలన్నది మరో డిమాండ్
సోనమ్ వాంగ్ చుక్‌పై విమర్శలు
కేంద్ర హోంశాఖ వాంగ్ చుక్ హింసకు బాధ్యుడని ఆరోపిస్తోంది. "వాంగ్ చుక్ ప్రసంగం కారణంగా హింస పెరిగింది" అంటూ కేంద్రం ఆరోపించింది. ప్రస్తుతం లేహ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు చల్లార్చేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటున్నది. లేహ్, కార్గిల్ లో కర్ఫ్యూ విధించింది. మరిన్ని భద్రతా పరమైన చర్యలు కూడా ప్రారంభించింది. ఐదుగురికి మించి సమావేశం కావడాన్ని నిషేధించారు.
నేపాల్ ప్రభావం
18 ఏండ్ల నుంచి 25 ఏండ్ల మధ్య ఉన్న యువకులు ఈ ఉద్యమంలో ఎక్కువగా పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇటీవల నేపాల్ లో జరిగిన ఆందోళనల్లోనూ వీరే ఎక్కువగా పాల్గొన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ముందుగానే చర్చలు జరుపుకొని నిరసనల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా వీరంతా ఒక్కటవుతున్నారన సమాచారం. లడఖ్‌లో బౌద్ధ, ముస్లిం ట్రైబల్స్ ఈ ఉద్యమంలో పాల్గొంటున్నట్టు సమాచారం. వారంతా తమ సాంస్కృతిక గుర్తింపును కోల్పోతున్నారని భావిస్తున్నారు. వాంగ్ చుక్ తరుచూ హింసను ఖండిస్తూ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిస్తున్నారు. అయినప్పటికీ యువత రోడ్ల మీదకు వచ్చిన నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. చైనా సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడ జరుగుతున్న హింసపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2020 గల్వాన్ ఘటన తర్వాత భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు కాస్త పెరిగిన విషయం తెలిసిందే.
కేంద్రం ఏం చేయబోతున్నది ?
కేంద్ర ప్రభుత్వం ఈ ఆందోళనను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి. ఆందోళనకారులతో చర్చించి వారు లేవనెత్తిన డిమాండ్ల మీద చర్చలు జరుపుతుందా? లేదంటే అక్కడ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని చూస్తుందా? అన్నది వేచి చూడాలి. ఉద్యమకారుల మీద ఆరోపణలు చేయడం.. నిరసన ప్రదర్శనను పాకిస్థాన్‌కు ముడిపెట్టి మాట్లాడటంపై కొన్ని విమర్శలు ఉన్నాయి. కేంద్రం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.
