Let's talk: editor@tmv.in
లడఖ్‌ ప్రజల గొంతు నొక్కొద్దు- ఆ ప్రాంతాన్ని ఆరో షెడ్యూల్‌లో చేర్చండి

లడఖ్‌ ప్రజల గొంతు నొక్కొద్దు- ఆ ప్రాంతాన్ని ఆరో షెడ్యూల్‌లో చేర్చండి

Aravind Maryada Reddy
29 సెప్టెంబర్, 2025

లడఖ్‌ను 6వ షెడ్యూల్‌లో చేర్చాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అక్కడి ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. లడఖ్ సంస్కృతిని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. అక్కడి ప్రజలు అణిచివేతకు గురవుతున్నారని పేర్కొన్నారు. లేహ్‌లో సెప్టెంబర్ 24న జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో సహా మొత్తం 44 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టును సైతం రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు.

ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "లడఖ్‌ ప్రజలు, సంస్కృతి, సంప్రదాయాలు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దాడికి గురవుతున్నాయి. లడక్ ప్రజల గొంతును నొక్కేస్తున్నారు. వెంటనే లడఖ్‌ను ఆరో షెడ్యూల్‌లో చేర్చాలంటూ డిమాండ్ చేశారు. కాగా ఇటీవల హింసాత్మక ఘటనలకు సంబంధించి లడఖ్ డీజీపీ ఎస్‌డీ సింగ్ జమ్వాల్ మాట్లాడుతూ.. పోలీసులు హింసకు పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అందులో సోనమ్ వాంగ్ చుక్ ప్రధాన నిందితుడని చెప్పారు.

సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు పాకిస్తాన్‌తో సంబంధాలున్నాయని పోలీసులు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన విదేశీ పర్యటనలపై కూడా ప్రశ్నిస్తున్నారు. "ఇటీవల పాకిస్తాన్ పీఐఓను అరెస్టు చేశాం, అతడు సరిహద్దు అవతలికి రిపోర్టింగ్ చేస్తున్నాడు. మాకు దీనికి రికార్డు ఉంది. అతడు (సోనమ్ వాంగ్‌చుక్) పాకిస్తాన్‌లో డాన్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. అతడు బంగ్లాదేశ్‌ను కూడా సందర్శించాడు. కాబట్టి, అతనిపై దృష్టి పెట్టాం అని పోలీసులు చెబుతున్నారు. సోనమ్ వాంగ్‌చుక్‌ను నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్‌ఎస్‌ఏ) నిబంధనల కింద అదుపులోకి తీసుకుని, జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో బంధించారని అధికారులు చెప్పారు.

లడఖ్‌ ప్రజల గొంతు నొక్కొద్దు- ఆ ప్రాంతాన్ని ఆరో షెడ్యూల్‌లో చేర్చండి - Tholi Paluku