Let's talk: editor@tmv.in
లడఖ్ నిరసన జ్వాలలకు కారణం ఏమిటి?

లడఖ్ నిరసన జ్వాలలకు కారణం ఏమిటి?

Dr.Chokka Lingam
29 సెప్టెంబర్, 2025

కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ గత కొన్ని రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతున్నది. నిరసనకారులు ప్రతి నిత్యం రోడ్ల మీదకు వస్తున్నారు. ఓ దశలో సహనం కోల్పోయి హింసకు పాల్పడ్డారు. ఆ హింసాత్మక ఘటనల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే లడఖ్ రాజధాని లేహ్‌లో ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. లడఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని.. ఈ ప్రాంతాన్ని ఆరో షెడ్యూల్‌లో కలపాలన్న డిమాండ్‌తో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అసలు ఇక్కడి ప్రజల డిమాండ్ ఏమిటి? వారు ఆరవ షెడ్యూల్ గురించి ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారు. అన్ని అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆగస్టు 2019లో లడఖ్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. ఆగస్టు 5, 2019 వరకు, లడఖ్ జమ్మూ, కశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. అప్పుడు వారికి ఆర్టికల్ 370 కింద ప్రత్యేక స్వయంప్రతిపత్తి ఉండేది. ఈ నిబంధన ప్రకారం జమ్ముకశ్మీర్‌కు రాజ్యంగం నుంచి అనేక సడలింపులు ఉండేవి. భూమి మీద హక్కులు ఈ ప్రాంతం వారికే ఉండేవి. పార్లమెంట్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్ముకశ్మీర్‌ను విభజించారు. లడఖ్ ను జమ్ము నుంచి వేరు చేసి.. కేంద్రపాలిత ప్రాంతంగా మర్చారు. ఈ మార్పును లడఖ్‌ ప్రజలు ప్రత్యేక గుర్తింపు వస్తుందని సంబరపడ్డారు. కానీ ఈ ఆనందం ఎక్కువరోజులు ఉండలేదు. ఎన్నికైన అసెంబ్లీ లేకపోవడంతో స్థానిక నిర్ణయాధికారం ఢిల్లీలోని బ్యూరోక్రాట్‌లకు మారింది. దీంతో ఇక్కడి ప్రజల గుండె మండింది. ఒకప్పుడు జమ్ము కశ్మీర్ రాజ్యాంగం ద్వారా ఇక్కడి భూములకు రక్షణ ఉండేది. ఉద్యోగ కల్పన కూడా జమ్ము చట్టం వల్లే జరిగేది. కానీ ఇప్పుడు మొత్తం కేంద్ర ఆధీనంలోకి వెళ్లిపోయింది. దీంతో వారు తట్టుకోలేకపోతున్నారు.

ఆరవ షెడ్యూల్ డిమాండ్ ఎందుకు?

నిరసనకారుల లడఖ్‌ను భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద చేర్చాలని కోరుతోంది. ఆరవ షెడ్యూల్ ప్రస్తుతం అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంలోని కొన్ని గిరిజన ప్రాంతాలకు వర్తిస్తోంది. ఆర్టికల్ 244(2), 275(1)లలో ఆరవ షెడ్యూల్ గురించి ప్రస్తావించారు. ఈ షెడ్యూల్ ప్రకారం స్వయం ప్రతిపత్త జిల్లా మండళ్లను ఏర్పాటు చేస్తుంది. ఇవి భూమి వినియోగం, అడవులు, ఆచారాలు, గ్రామ పరిపాలన, స్థానిక పన్నులపై చట్టాలు చేసే అధికారం కలిగి ఉంటాయి.

ఈ ప్రత్యేక మండళ్లు భూమి బదిలీని నియంత్రించగలవు. గిరిజనేతరులకు భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడతాయి. వ్యవసాయం, నీరు, గ్రామ న్యాయస్థానాలు, వారసత్వం, చట్టాలు చేసుకునే వీలు ఉంటుంది. కొన్ని పన్నులు, రుసుములను విధించి, సేకరించవచ్చు. సాంప్రదాయ ఆచారాలు, స్థానిక పాలన వ్యవస్థలు రాజ్యాంగ బలాన్ని పొందుతాయి. లడఖ్ గిరిజన సముదాయాలకు , లేహ్‌లోని బౌద్ధులు, కార్గిల్‌లోని షియా ముస్లింలు వంటి తెగలకు ఈ చట్టం రక్షణ కల్పించే అవకాశం ఉంది.

ఆర్టికల్ 370, ఆరవ షెడ్యూల్ మధ్య తేడాలు ఏమిటి?

ఆర్టికల్ 370 అమల్లో ఉన్నప్పుడు జమ్మూ, కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగ స్వయంప్రతిపత్తి ఉండేది. ఈ నిబంధన కింద, రాష్ట్రానికి సొంత రాజ్యాంగం, సొంత జెండా, పూర్తి అధికారాలు కలిగిన శాసనసభ ఉండేది. ఈ ఆర్టికల్ శాసనసభకు విస్తృత అధికారాలు ఇచ్చింది. భూమి యాజమాన్యం కఠినంగా నియంత్రించబడేది. బయటి వ్యక్తులు ఆస్తి కొనుగోలు చేయడంపై పరిమితులు ఉండేవి. కేంద్ర చట్టాలు రాష్ట్రపతి ఆదేశాల ద్వారా ఎంపిక చేయబడి వర్తింపజేయబడేవి. మొత్తంగా, ఆర్టికల్ 370 రాష్ట్రమంతటికీ కింది స్థాయిలో రాజకీయ స్వయంప్రతిపత్తిని అందించింది. భారత యూనియన్‌లో భాగంగా ఉంటూ గణనీయమైన స్వీయ-పాలనను అనుమతించింది.

ఆరవ షెడ్యూల్ ఏం చెబుతోంది?

ఆరవ షెడ్యూల్ భారతదేశం ఈశాన్య రాష్ట్రాలలోని నిర్దిష్ట గిరిజన జిల్లాలకు వర్తిస్తుంది. ఇది స్థానిక స్థాయిలో పరిపాలన స్వయంప్రతిపత్తిని అందిస్తుంది. ఇది జిల్లా, ప్రాంతీయ స్వయం ప్రతిపత్త మండళ్లకు భూమి వనరుల నిర్వహణ వంటి నిర్దిష్ట విషయాలపై పాలన చేయడానికి అధికారం ఇస్తుంది. గిరిజనేతరులకు భూమి బదిలీని నియంత్రించే అధికారాన్ని అందిస్తుంది. అయితే, రక్షణ, విదేశీ వ్యవహారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో ఉంటాయి. ఆర్టికల్ 370 రాష్ట్రమంతటికీ సమగ్ర రక్షణలను అందించినప్పటికీ, ఆరవ షెడ్యూల్ నిర్దిష్ట ప్రాంతాలలో గిరిజన ఆసక్తులను రక్షించడంపై దృష్టి సారిస్తూ ఆస్తుల రక్షణ, ఆచార వ్యవహారాలు కాపాడే విధంగా ఉంటుంది. లడఖ్ వంటి ప్రాంతాలు ఆరవ షెడ్యూల్ రక్షణల నుంచి ప్రయోజనం పొందవచ్చని చాలామంది వాదిస్తున్నారు.

కేంద్రం ఏమంటోంది?

కేంద్రం లడఖ్ ప్రత్యేక గిరిజన స్వభావాన్ని గుర్తించింది. 2020లో జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్, ఈ ప్రాంతంలో పర్యటించింది. 97% గిరిజన జనాభా ఉన్నందున ఆరవ షెడ్యూల్ చేర్పించాలని సిఫారసు చేసింది. అయితే ఆరవ షెడ్యూల్ ఈశాన్య రాష్ట్రాల సంక్లిష్ట జాతి వైవిధ్యం కోసం రూపొందించబడిందని, దీనిని ఇతర ప్రాంతాలకు విస్తరించడానికి రాజ్యాంగ సవరణ అవసరమని సూచించారు. బదులుగా ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించింది.

రాష్ట్ర హోదా కోసం డిమాండ్

ఆరవ షెడ్యూల్ డిమాండ్‌తో పాటు, పూర్తి రాష్ట్ర హోదా డిమాండ్ కూడా ఉంది. ఎన్నికైన శాసనసభ లేకుండా ఏ రకమైన స్థానిక స్వయంప్రతిపత్తి ఉన్నా ఉపయోగం ఉండదని చాలామంది లడఖ్ వాసులు వాదిస్తున్నారు. రాష్ట్ర హోదా వారికి రాజ్యసభలో ప్రాతినిథ్యం, భూమి, ఉపాధి విధానాలపై నియంత్రణ, ప్రజలకు నేరుగా జవాబుదారీగా ఉండే ప్రభుత్వాన్ని ఇస్తుంది.

చైనా, పాకిస్తాన్‌తో సరిహద్దులు కలిగిన ప్రాంతాన్ని కేంద్రప్రభుత్వం ఎంతో సున్నితమైన ప్రాంతంగా భావిస్తోంది. అందుకే ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వడం భద్రతా, పరిపాలన సవాళ్లు ఎదురవుతాయిన కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. లడఖ్ భారతదేశానికి ఎంతో కీలకమైన ప్రాంతం. వైమానిక స్థావరాలు, చైనాతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి సున్నితమైన సరిహద్దులను కలిగి ఉంది. ఏ రాజ్యాంగ మార్పు అయినా జాతీయ భద్రతా దృక్కోణం నుంచి చూడాల్సి వస్తుంది. అదే సమయంలో, ప్రాంతంలోని పర్యావరణ వ్యవస్థ, నీటి కొరత, వేగంగా పెరుగుతున్న పర్యాటకం అభివృద్ధి, సంరక్షణ మధ్య వంటి అంశాలు కూడా ఉన్నాయి. సౌర శక్తి , వ్యవసాయం ఆశాజనకంగా ఉన్నాయి.

రాజ్యాంగ రక్షణలు లేకుండా, పెద్ద కార్పొరేషన్లు భూమిని చౌకగా కొనుగోలు చేయవచ్చని.. సామాజిక నిర్మాణాన్ని మార్చవచ్చని.. సాంప్రదాయ జీవనోపాధులను ప్రమాదంలోకి నెట్టవచ్చని నిరసనకారులు భయపడుతున్నారు. ఆరవ షెడ్యూల్ కేవలం భూమి గురించి కాదు. ఇది మా సాంస్కృతిక జీవనం గురించి అని పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ వాదిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో నిరాహార దీక్ష ద్వారా ఆయన జాతీయ దృష్టిని ఆకర్షించాడు.

కొనసాగుతున్న చర్చలు

లడఖ్ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. కానీ ఓ కొలిక్కి రావడం లేదు. త్వరలో జరగనున్న హిల్ కౌన్సిల్ ఎన్నికలు ఆరవ షెడ్యూల్ డిమాండ్‌పై ఒక రిఫరెండమ్‌గా మారే అవకాశం ఉంది. న్యాయ నిపుణులు ఈ సమస్యకు పరిష్కారాలను వెతికే ప్రయత్నంలో ఉన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా ఆరో షెడ్యూల్‌లో నేరుగా చేర్చడం. లడఖ్ ప్రాంతాన్ని ఆరో షెడ్యూల్ లో చేర్చాలంటే మూడింటి రెండు వంతుల మెజార్టీతో పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇంత సాహసమైన నిర్ణయాన్ని తీసుకుంటుందా? అన్నది వేచి చూడాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది? అన్నది వేచి చూడాలి.

లడఖ్ నిరసన జ్వాలలకు కారణం ఏమిటి? - Tholi Paluku