Let's talk: editor@tmv.in
లడఖ్ అభివృద్ధి కోసం మళ్లీ పని ప్రారంభిస్తాం:గీతాంజలి ఆంగ్మో

లడఖ్ అభివృద్ధి కోసం మళ్లీ పని ప్రారంభిస్తాం:గీతాంజలి ఆంగ్మో

Pinjari Chand
16 మార్చి, 2026

సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ పై విధించిన నిర్బంధాన్ని కేంద్ర హోంశాఖ రద్దు చేసిన నేపథ్యంలో, ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో స్పందించారు. తమ కుటుంబం మళ్లీ విద్యాభివృద్ధి, లడఖ్ అభివృద్ధి కోసం పూర్వంలాగే పని కొనసాగిస్తుందని ఆమె తెలిపారు.కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ, నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్ కింద విధించిన వాంగ్‌చుక్ నిర్బంధాన్ని వెంటనే అమల్లోకి వచ్చేలా రద్దు చేసింది.

ఈ నిర్ణయం అనంతరం ఏఎన్ఐతో మాట్లాడిన గీతాంజలి ఆంగ్మో మాట్లాడుతూ, వాంగ్‌చుక్ ఆరు నెలలు పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో గడిపారని, ముందుగా పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం వారు లడఖ్‌కు వెళ్లి తమ పని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.

విద్యా రంగంలో తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ హిమాలయన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ అల్టర్‌‌నేటివ్స్, లడఖ్ (హెచ్ఐఏఎల్)ను గొప్ప విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. అలాగే హిమాలయ ప్రాంతంలోని హిమనదులను (గ్లేసియర్లు) సంరక్షించడం, లడఖ్ ప్రజలను శక్తివంతంగా మార్చడం తమ ప్రధాన లక్ష్యాలని ఆమె పేర్కొన్నారు. నిర్బంధం రద్దు కావడం సత్యం విజయం సాధించినట్లు అని ఆమె వ్యాఖ్యానించారు. భారతదేశపు నినాదం అయిన ‘సత్యమేవ జయతే’ కేవలం నినాదం మాత్రమే కాదు, వాస్తవమని అన్నారు.

ఇది సత్యం గెలిచిన సందర్భం. దేశం మొత్తం మంచి, చెడు విషయాలపై ఆలోచించేలా చేసింది. ఇది చాలా మందికి ఒక పాఠంలా మారిందని ఆమె చెప్పారు. ఎంతోకాలం తర్వాత తాము స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం లభించిందని గీతాంజలి ఆంగ్మో తెలిపారు. ముందుగా ప్రతి సమావేశం సమయంలో పరిమితి ఉండేదని, పోలీసులు పక్కనే ఉండేవారని చెప్పారు.ఇప్పుడు వాంగ్‌చుక్ దేశానికి సేవ చేయడానికి మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారని ఆమె పేర్కొన్నారు.