
‘లఖీంపూర్’ నిందితుడు పండుగ చేసుకోవచ్చు
లఖింపూర్ ఖేరీ హింసా కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అజయ్ మిశ్రా టేని కొడుకు అశీష్ మిశ్రాకు దీపావళి పర్వదినం సందర్భంగా కుటుంబంతో గడపడానికి సుప్రీంకోర్టు గురువారం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. దీంతో అక్టోబర్ 20 నుంచి 22 వరకు ఆయన లఖింపూర్ ఖేరీ కి వెళ్లి కుటుంబ సభ్యులను కలవనున్నారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బగ్చీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులను జారీ చేసింది. మిశ్రా తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ముందుగా విధించిన షరతులన్నీ అలాగే ఉంటాయని స్పష్టం చేసింది.
సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో అశీష్ మిశ్రాపై కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, సాక్షి బల్జీందర్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన సీనియర్ అధికారి దీనిపై దర్యాప్తు కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది. ఆగస్టు 7న సింగ్ ఫిర్యాదుపై యుపీ పోలీసులు నిర్లక్ష్యం వహించడంపై సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. సాక్షి భద్రత, వాంగ్మూలం నమోదు వంటి అంశాలపై జిల్లా ఎస్పీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గతంలో అశీష్ మిశ్రాకు 2023 జనవరి 25న సుప్రీంకోర్టు ఎనిమిది వారాల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఆ గడువును పలుమార్లు పొడిగించింది. మిశ్రా లేదా ఆయన కుటుంబ సభ్యులు సాక్షులను ప్రభావితం చేయడం, కేసును ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేయడం వంటి ప్రయత్నాలు చేస్తే బెయిల్ రద్దవుతుందని కోర్టు అప్పట్లో హెచ్చరించింది. తరువాత 2025 మేలో కోర్టు మిశ్రాకు ప్రతి శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు కుటుంబాన్ని కలవడానికి లఖింపూర్ వెళ్లేందుకు అవకాశం ఇచ్చింది.అయితే ఆయన ప్రజా సమావేశాలకు, రాజకీయ కార్యక్రమాలకు హాజరుకాకూడదన్న నిబంధన విధించింది.
ఈరోజు తీర్పుతో కోర్టు ఆ తాత్కాలిక బెయిల్ షరతులను కొంత మార్చి, దీపావళి సందర్భంగా కుటుంబాన్ని కలిసేందుకు లఖింపూర్ వెళ్లేందుకు అనుమతించింది. అశీష్ మిశ్రా అక్టోబర్ 22న తిరిగి లక్నోకు వస్తారని ఆయన న్యాయవాది పూచీకత్తు సమర్పించారు.
అప్పట్లో సంచలనం
2021 అక్టోబర్ 3న టికోనియా గ్రామం సమీపంలో మూడు వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతుల పైకి అప్పటి కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో రాష్ట్రీయ మంత్రి గా ఉన్న అజయ్ మిశ్రా టేని కుమారుడు అశీష్ మిశ్రా రైతులపైకి వాహానాలను పొనిచ్చాడు. అక్కడికక్కడే నలుగురు రైతులు మరణించారు.దీంతో రైతు ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. అనంతరం హింస చెలరేగింది. దానివల్ల మరో నలుగురు మరణించారు. మొత్తం 8 మంది ఈ ఘటన వల్ల అసువులు బాశారు. ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన జరిగిందని సుప్రీంకోర్టు నియమించిన సిట్ తేల్చింది. దీంతో అశీష్ పై హత్యనేరం కింద అదే ఏడాది అక్టోబర్ 9న అరెస్ట్ చేశారు.
