
లక్ష్యాలను చేరుకోవడంలో అలసత్వం వద్దు..అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలి: ఏపీ సీఎం
ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సంతృప్తి కలిగించే రీతిలో అందినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం సహించేది లేదని తేల్చి చెప్పారు.
ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం.. ఐదు లక్షల గృహాలు పూర్తి కావాలి
రాష్ట్రంలో గృహ నిర్మాణ ప్రక్రియను పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాదిలో మరోసారి భారీ స్థాయిలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. టిడ్కో గృహాలు కాకుండా గృహ నిర్మాణ శాఖ ద్వారా మరో 5 లక్షల ఇళ్లను సత్వరమే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు. సర్వే నివేదికల ప్రకారం రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది కొత్తగా ఇళ్ల స్థలాలు కోరుతున్నారని వారికి వీలైనంత త్వరగా పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. "ఇళ్ల నిర్మాణం ఎంత వేగంగా సాగుతోందో పట్టాల పంపిణీ కూడా అదే స్థాయిలో సాగాలి" అని సీఎం స్పష్టం చేశారు.
ఉచిత ఇసుకపై పటిష్ట నిఘా.. అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు
ఉచిత ఇసుక విధానంపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని వదులుకుని ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో ఉచిత ఇసుక ఇస్తున్నాం. రీచులు, స్టాక్ యార్డుల వద్ద రవాణా పేరిట కానీ, ఇతర కారణాలతో కానీ అదనపు ఛార్జీలు వసూలు చేస్తే సహించేది లేదు" అని హెచ్చరించారు. వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా ఇప్పటి నుంచే నిల్వలు పెంచుకోవాలని, నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
విద్యా రంగంలో సంస్కరణలు.. నూతన కరికులమ్ అవసరం
మారుతున్న కాలానికి అనుగుణంగా కాలేజీ విద్యను రీ-ఓరియెంటేషన్ చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, సంప్రదాయ కోర్సులతో పాటు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. ఆంధ్ర యూనివర్సిటీ సహా రాష్ట్రంలోని అన్ని వర్సిటీల ర్యాంకింగ్‌లను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యామండలి మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, మధ్యాహ్న భోజన పథకం నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
ప్రమాదాల నివారణే లక్ష్యం.. సాంకేతికత వినియోగం
రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, పిడుగుపాటు మరణాల పట్ల సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా త్రిపుల్ రైడింగ్ వల్ల ప్రాణాలు పోతున్నాయని ప్రజల్లో హెల్మెట్ వాడకంపై అవగాహన పెంచాలని సూచించారు. గాలిలో వేలాడుతున్న విద్యుత్, కేబుల్ తీగల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని, అటువంటి లోపాలను తక్షణమే సరిచేయాలని ఆదేశించారు. పిడుగుపాట్ల సమయంలో కేవలం ఫోన్లకు మెసేజ్‌లు పంపడమే కాకుండా, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలని, టవర్ లొకేషన్ల ఆధారంగా హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు.
అనంతరం ఆర్టీజీఎస్ రూపొందించిన 'అవేర్ 2.0' మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ సాంకేతికత ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
