Let's talk: editor@tmv.in
లక్ష్యం చేరే వరకు విశ్రమించొద్దు: ఉపరాష్ట్రపతి

లక్ష్యం చేరే వరకు విశ్రమించొద్దు: ఉపరాష్ట్రపతి

Pinjari Chand
10 నవంబర్, 2025

‘స్థిరత్వమే విజయానికి మూలం.ప్రతి విద్యార్థి తన సొంత ప్రతిభను గుర్తించి, తన శైలిలోనే లక్ష్యాన్ని చేరుకోవాలని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద ప్రసిద్ధ నినాదం ‘అరైజ్‌, అవేక్‌, లక్ష్యం చేరే వరకు ఆగొద్దని, కష్టాలు వచ్చాయని వెనుదిరగరాదని, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆదివారం మైసూర్ లోని జెఎస్సెస్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (జెఎస్సెస్‌ ఏహెచ్ఈఆర్‌) 16వ కాన్వకేషన్‌ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమం మైసూరు శ్రీ శివరాత్రీశ్వర నగరంలోని జెఎస్సెస్‌ క్యాంపస్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన కర్ణాటక సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వాన్ని, కన్నడకు లభించిన క్లాసికల్‌ లాంగ్వేజ్‌ హోదాను ఆయన ప్రశంసించారు. విద్యార్థుల భవిష్యత్తుకు నూతన విద్యా విధానం (ఎన్ఈపీ–2020) మార్గదర్శకమని, అది అంతరశాఖా అధ్యయనం, సౌలభ్యం, స్వతంత్ర ఆలోచనకు కొత్త దిశ చూపుతోందని పేర్కొన్నారు.

సోషల్‌ మీడియా వినియోగంలో క్రమశిక్షణ అవసరమని, నిజ జీవిత బాధ్యతలను విస్మరించకుండా ఆన్‌లైన్‌ ప్రపంచాన్ని సమతౌల్యంగా ఉపయోగించాలన్నారు. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలని, ఇతరులలోని మంచిని స్వీకరించి, చెడును దూరం పెట్టాలని సూచించారు. ఉపరాష్ట్రపతి జ్ఞానం నిజమైన సంపద అనే విషయాన్ని తెలుపుతూ విద్యార్థులు జ్ఞాన ప్రకాశంతో దేశ నిర్మాణానికి తోడ్పడాలని ‘వికసిత్‌ భారత్‌–2047’ లక్ష్య సాధనలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు.

ఈ కాన్వకేషన్‌లో మొత్తం 2,925 మంది విద్యార్థులకు డిగ్రీలు, డిప్లోమాలు, ఫెలోషిప్‌లు ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 16 మంది గోల్డ్‌ మెడలిస్టులను ఉపరాష్ట్రపతి సత్కరించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లోత్‌, జెఎస్సెస్‌ ఛాన్సలర్‌ జగద్గురు శివరాత్రీ దేశికేంద్ర మహాస్వామిజీ, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి శివరాజ్‌ వి. పాటిల్‌, తదితరులు హాజరయ్యారు.

లక్ష్యం చేరే వరకు విశ్రమించొద్దు: ఉపరాష్ట్రపతి - Tholi Paluku