
'లక్కీ డ్రా' మోసాలు.. ఇన్‌ఫ్లూయెన్సర్లకు వీసీ సజ్జనార్ వార్నింగ్
సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న కొంతమంది ఇన్‌ఫ్లూయెన్సర్లు 'లక్కీ డ్రా'ల పేరుతో సామాన్య ప్రజలను మోసం చేస్తున్న వ్యవహారం కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా భారీ బిల్డప్ ఇచ్చి, వాస్తవంలో మాత్రం అమాయకులను మోసం చేస్తున్న లక్కీ డ్రా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఇటీవల కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కార్లు, బైకులు, ప్లాట్లు, డీజే సెట్లు వంటి ఖరీదైన బహుమతులు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో ప్రజలను ఆకర్షిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చిందని తెలిపారు.
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై నియంత్రణలు కఠినతరం కావడంతో, అదే తరహా మోసాలకు లక్కీ డ్రాలనే కొత్త రూపంలో వీరు తెరపైకి వస్తున్నారని పేర్కొన్నారు. తక్కువ మొత్తంలో టికెట్లు లేదా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేయిస్తామని చెప్పి, చివరికి బహుమతులు ఇవ్వకుండా ప్రజల డబ్బును కొల్లగొడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా యువత, మధ్యతరగతి కుటుంబాల ఆశలను ఆసరాగా చేసుకుని నిండా ముంచుతున్నారని తెలిపారు.
ఈ తరహా మోసాలు చట్టవిరుద్ధమని వీసీ సజ్జనార్ అన్నారు. ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలు లేదా సోషల్ మీడియా స్టార్లు అయినా సరే చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. ఇలాంటి అక్రమలకు పాల్పడుతే ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్, 1978 ప్రకారం కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. అవసరమైతే అరెస్టులు, ఆస్తుల స్వాధీనం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
