Let's talk: editor@tmv.in
లిక్కర్ స్కామ్‌లో ఈడీ స్పీడ్!

లిక్కర్ స్కామ్‌లో ఈడీ స్పీడ్!

FL - SUNL
20 సెప్టెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఈడీ ఎంట్రీ కలకలం రేపుతోంది. ఈడీ ఒక్కసారిగా పలు రాష్ట్రాల్లో సోదాలు చేయడంతో వైసీపీ పెద్దలు ఉలిక్కిపడ్డారు. ఇంత కాలం సిట్ మాత్రమే విచారణ జరుపుతోందని, తమ స్కామ్ ఇంటర్నేషనల్ కాబట్టి భయం లేదని, ఎక్కడో ఓ చోట తీగ తెగిపోతుందని అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఈడీ పూర్తిస్థాయిలో హడావిడి లేకుండా చేయాలనుకున్న పనులన్నీ చేస్తోందని క్లారిటీ వచ్చాక వారంతా కంగారు పడిపోతున్నారు. తమ దాకా ఎప్పుడు వస్తారా అని బిక్కుబిక్కుమంటున్నారు.

ఈడీ పక్కా సమాచారంతోనే సోదాలు చేసింది. లిక్కర్ స్కామ్‌లో బ్లాక్ మ‌నీ ఎవరెవరి దగ్గరకు చేరింది, వారు ఎలా దాన్ని ఎలా వైట్ మ‌నీగా మార్చుకున్నారు, దాని కోసం ఎన్ని షెల్ కంపెనీలు పెట్టారు, ఇలా మొత్తం సమాచారం ఉండటంతో ఆయా చోట్ల సోదాలు చేశారు. పక్కా ఆధారాలతో చేసిన ఈ సోదాల్లో ఆ లావాదేవీల సమాచారం అంతా వారికి లభించింది. ఈడీ ఇప్పటికే చాలా ర‌హ‌స్యంగా విచారణ చేస్తూ అన్ని వివ‌రాలు సేక‌రిస్తోంది. ఒక్క లక్ష రూపాయలు అక్రమంగా చేతులు మారినా ఈడీ సులువుగా గుర్తించగలదు. అలాంటిది వేల కోట్లు వైట్ మ‌నీగా చేసుకుంటే గుర్తించలేరా అన్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

ఈడీ అధికారులు మొత్తం సూత్రధారికి నగదు ఎలా చేరిందన్నది కూడా గుర్తించారు. హవాలా చేసిన నగదు ఎలా విదేశాలకు వెళ్లింద‌నేది తాజా సోదాల్లో తేల్చారు. మళ్లీ తిరిగి ఏ రూపంలో వచ్చింది, ఎవరి దగ్గరకు చేరిందన్నది కూడా ఇప్పటికే లెక్కలు తీశారు. తదుపరి రౌండ్ ఇదే అంశంపై సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. సిట్ విచారణ కీలక దశకు చేరనుంది. సూత్రధారి వద్దకు కేసు చేరినప్పుడు ఈడీ కూడా ఒకేసారి రంగంలోకి దిగి, పని పూర్తి చేసే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ సూత్రధారిని పూర్తి ఆధారాల‌తో పట్టుకునేందుకు పక్కా స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది.

తాడేపల్లిలో లాయర్ల హడావిడి

లిక్కర్ స్కామ్ వైసీపీ నేత‌ల‌ను కంగారు పెడుతోంది. మాజీ సీఎం జగన్, త‌న అనుచ‌ర‌గ‌ణం లాయర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కువగా బెంగళూరులోనే ఈ సమావేశాలు నిర్వహిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ స‌మావేశాలు తాడేపల్లిలోనూ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డిని ఈ వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించినట్లుగా చెబుతున్నారు. గుమ్మడికాయ దొంగ ఎవ‌రంటే భుజాలు తడుముకున్నట్లుగా వైసీపీ పెద్దలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

లిక్కర్ స్కామ్‌లో ఈడీ స్పీడ్! - Tholi Paluku