
లిక్కర్ కుంభకోణంలో మాజీ సీఎం కుమారుడు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న రూ 2,500 కోట్లకు పైగా మద్యం కుంభకోణం (లిక్కర్ స్కామ్) కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్‌ను అవినీతి నిరోధక బ్యూరో, ఆర్థిక నేరాల విభాగం అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. చైతన్యతో పాటు దీపెన్ చావడా అనే మరో నిందితుడిని కూడా ఈవోడబ్ల్యు అదుపులోకి తీసుకుంది.
ఈడీ వల నుంచి ఈవోడబ్ల్యు కస్టడీకి
మరోవైపు చైతన్య బఘేల్ అప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంతో జూలై 18 నుంచి జైలులో ఉన్నారు. దీంతో బుధవారం (సెప్టెంబర్ 24, 2025న) ప్రొడక్షన్ వారెంట్ ద్వారా కోర్టులో హాజరుపరిచిన అనంతరం ఈ ఇద్దరినీ ప్రత్యేక న్యాయస్థానం అక్టోబర్ 6వ తేదీ వరకు ఈవోడబ్ల్యు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇక ఏసీబీ/ఈవోడబ్ల్యు అరెస్ట్‌పై చైతన్య తరఫు న్యాయవాది ఫైజల్ రిజ్వీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగమని ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాక ఇంతవరకు ఏసీబీ/ఈవోడబ్ల్యు దాఖలు చేసిన ప్రధాన చార్జిషీట్‌లో ఎక్కడా చైతన్య పేరు లేదని ఆయన కోర్టుకు తెలిపారు. అదేవిదంగా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన తరువాత ఈ అరెస్ట్ జరిగింది. అరెస్ట్‌కు ఆధారం నిందితులలో ఒకరైన లక్ష్మీ నారాయణ్ బన్సల్ ఇచ్చిన వాంగ్మూలం మాత్రమేనని, అందులో సైతం చైతన్య పేరు ప్రస్తావించబడలేదని రిజ్వీ పేర్కొన్నారు. కాగా ఈ వాంగ్మూలం ఇచ్చిన బన్సల్‌పై అదే ప్రత్యేక కోర్టు వారెంట్ జారీ చేయడం గమనార్హం.
అధికార పార్టీ హయాంలో కుంభకోణం
రూ. 2,500 కోట్లకు పైగా విలువైన ఈ మద్యం కుంభకోణం 2019-2022 మధ్య భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఏసీబీ/ఈవోడబ్ల్యు తేల్చింది. జరిగిన ఈ స్కామ్ లో అధికారిక మద్యం అమ్మకాలపై అక్రమ మద్యంపై కమీషన్ వసూలు చేయడంతో పాటు డిస్టిలరీల మధ్య మార్కెట్ వాటాను పంచుకునేందుకు ప్రధాన డిస్టిలరీల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుందని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాక ఈ అక్రమ నిధులన్నీ అప్పటి అధికార పార్టీ (కాంగ్రెస్) ఇన్‌ఛార్జ్‌లు అధికారుల వద్దకు మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ/ఈవోడబ్ల్యు జనవరి 17, 2024న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మాజీ ఎక్సైజ్ మంత్రి కవాసి లఖ్మా, మాజీ ప్రధాన కార్యదర్శి వివేక్ ధండ్‌తో సహా 70 మంది వ్యక్తులు, కంపెనీల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో ఈడీ ఇప్పటికే కవాసి లఖ్మా, అన్వర్ ధేబర్, అనిల్ తూతేజా వంటి ప్రముఖులను అరెస్ట్ చేసింది.
మరోవైపు చైతన్య బఘేల్ అరెస్ట్‌తో ఛత్తీస్‌గఢ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ దీనిని రాజకీయ ప్రతీకార చర్య అని ఆరోపిస్తుండగా బీజేపీ మాత్రం నేరస్తులు ఎంత పెద్దవారైనా శిక్ష తప్పదని ఈ కేసు నిరూపిస్తోంది అని వివరించింది. రాష్ట్రంలో మద్యం వ్యాపారం ఎప్పటినుంచో వివాదాస్పదమే అయినా ఈ స్కామ్ వెలుగులోకి రావడం వల్ల ప్రజలలో ఆగ్రహం మరింత పెరుగుతోంది. దర్యాప్తు సంస్థలు స్కామ్‌కు సంబంధించి మరిన్ని కీలక ఆధారాలు సేకరిస్తున్నాయి. వచ్చే రోజుల్లో ఇంకెంతమంది రాజకీయ నాయకుల పేర్లు బయటపడతాయో అన్న ఆసక్తి పెరుగుతోంది.
