Let's talk: editor@tmv.in
లండన్‌లో యూదు అంబులెన్సులకు నిప్పుపెట్టిన దుండగులు

లండన్‌లో యూదు అంబులెన్సులకు నిప్పుపెట్టిన దుండగులు

Shaik Mohammad Shaffee
24 మార్చి, 2026

బ్రిటన్ రాజధాని లండన్‌లోని గోల్డెర్స్ గ్రీన్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున కలకలం రేగింది. యూదు సామాజిక వర్గానికి చెందిన 'హత్జాలా’ అంబులెన్స్ సర్వీసుకు చెందిన నాలుగు వాహనాలను దుండగులు నిప్పుపెట్టి దహనం చేశారు. ఈ ఘటనను మెట్రోపాలిటన్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనిని యూదు వ్యతిరేక విద్వేషపూరిత నేరంగా పరిగణిస్తూ దర్యాప్తు ప్రారంభించారు.

పేలిన గ్యాస్ సిలిండర్లు

హైఫీల్డ్ రోడ్‌లో అంబులెన్సులు తగలబడుతున్నట్లు సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల ధాటికి అంబులెన్సుల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలడంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. భారీ పేలుడు శబ్దాలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించి, ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

ముగ్గురు నిందితుల కోసం గాలింపు

స్థానిక పోలీస్ సూపరింటెండెంట్ సారా జాక్సన్ మాట్లాడుతూ, ఈ ఘటన సామాజికంగా తీవ్ర ఆందోళన కలిగించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ దృశ్యాలను, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ముగ్గురు అనుమానితులు ఈ దహనకాండకు పాల్పడినట్లు భావిస్తున్నారు. నిందితుల గురించి సమాచారం ఉన్నవారు వెంటనే పోలీసులకు తెలపాలని ఆమె కోరారు.

భద్రత కట్టుదిట్టం

ఈ ఘటన నేపథ్యంలో గోల్డెర్స్ గ్రీన్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మత పెద్దలతో చర్చలు జరుపుతున్నామని, ప్రజల్లో ధైర్యాన్ని నింపేందుకు అదనపు బలగాలతో గస్తీ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. అంబులెన్సుల వంటి అత్యవసర సేవలను లక్ష్యంగా చేసుకోవడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

సమాజంలో విద్వేషానికి చోటు లేదు: ప్రధాని

ఈ దారుణ ఘటనను బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్ తీవ్రంగా ఖండించారు. "ఇది అత్యంత దిగ్భ్రాంతికరమైన విద్వేషపూరిత దాడి. ఉదయాన్నే ఈ దారుణ వార్తతో నిద్రలేచిన యూదు సమాజానికి నా సంఘీభావం తెలుపుతున్నాను. మన సమాజంలో ఇలాంటి విద్వేషాలకు తావు లేదు" అని ఆయన 'ఎక్స్‌' వేదికగా స్పష్టం చేశారు. బాధ్యులను పట్టుకునేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.