Let's talk: editor@tmv.in
లంక ప్రీమియర్ లీగ్ డిసెంబర్‌లోనే

లంక ప్రీమియర్ లీగ్ డిసెంబర్‌లోనే

Shaik Mohammad Shaffee
7 అక్టోబర్, 2025

ప్రతిష్టాత్మక లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్) ఆరవ ఎడిషన్ 2025 డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఈ లీగ్ డిసెంబర్ 23 వరకు కొనసాగనుంది. మొత్తం 24 రోజుల పాటు టీ20 ఫార్మాట్‌లో ఈ క్రికెట్ పోరు జరగనుంది. ఇది టోర్నమెంట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ సీజన్‌గా నిలవనుంది. ఈ షెడ్యూల్ 2026లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆటగాళ్లకు అపారమైన మ్యాచ్ అనుభవాన్ని, హై క్వాలిటీ గల ప్రాక్టీస్‌ను అందిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఈ ఎడిషన్‌లో మొత్తం 24 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో 20 లీగ్ మ్యాచ్‌లు, 4 నాకౌట్ మ్యాచ్‌లు ఉంటాయి. మూడు ప్రధాన వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. కొలంబోలోని ఆర్. ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దంబుల్లాలోని రంగిరి దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భారత క్రికెటర్లు తొలిసారిగా ఈ లీగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. వారి పేర్లు త్వరలో వెల్లడి కానున్నాయి.

యువ ప్రతిభకు వేదిక

ఎల్‌పీఎల్ టోర్నమెంట్ డైరెక్టర్ సమంత దొడన్‌వెలా మాట్లాడుతూ, "2026లో జరగబోయే పురుషుల టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఆటగాళ్లకు హై క్వాలిటీ మ్యాచ్ ప్రాక్టీస్ లభించేలా ఈ ఎడిషన్ సమయాన్ని ఎంచుకున్నాం. గత సీజన్‌లలో ఎల్‌పీఎల్ యువ ప్రతిభకు నిలయంగా మారింది. చాలా మంది యువ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ స్టార్స్‌తో కలిసి తమదైన ముద్ర వేశారు. ఈ సంవత్సరం కూడా ప్రపంచకప్‌కు ముందు సంచలనాలు సృష్టించగల కొత్త ఆటగాళ్లను ఈ లీగ్ పరిచయం చేస్తుందని మేము నమ్ముతున్నాం" అని తెలిపారు.

ఫార్మాట్, ప్లేఆఫ్స్ వివరాలు

టోర్నమెంట్ ఫార్మాట్ ప్రకారం, లీగ్ దశలో ఐదు ఫ్రాంచైజీలు ఒకదానితో ఒకటి రెండుసార్లు పోటీపడతాయి. రౌండ్-రాబిన్ దశ ముగిసిన తర్వాత టాప్ నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెడతాయి. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ టాప్-2 జట్ల మధ్య జరుగుతుంది. విజేత జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో 3వ, 4వ స్థానాల్లో ఉన్న జట్లు తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2కు వెళ్తుంది. క్వాలిఫైయర్ 2లో క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టుతో ఎలిమినేటర్‌ విజేత తలపడుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళుతుంది.

ఎల్‌పీఎల్ అధికారిక హక్కుల హోల్డర్ అయిన ఐపీజీ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈఓ అనిల్ మోహన్ శంఖధర్ మాట్లాడుతూ, "లంక ప్రీమియర్ లీగ్ ఆసియాలో అత్యంత ఉత్కంఠభరితమైన టీ20 లీగ్‌లలో ఒకటి. గత సంవత్సరం సీజన్‌కు వచ్చిన అద్భుత స్పందనే దానికి నిదర్శనం. 780 మిలియన్లకు పైగా ప్రేక్షకులు ఈ లీగ్‌ను ప్రత్యక్షంగా టీవీల్లో వీక్షించారు. ఈ లీగ్ శ్రీలంకలోనే కాకుండా భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాల్లో కూడా బాగా ఆదరణ పొందింది. 2025 ఎడిషన్ ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతుందని మేము నమ్ముతున్నాం" అని చెప్పారు.

లంక ప్రీమియర్ లీగ్ డిసెంబర్‌లోనే - Tholi Paluku