Let's talk: editor@tmv.in
రూ.1.6 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్‌

రూ.1.6 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్‌

Panthagani Anusha
27 సెప్టెంబర్, 2025

ఇటీవల మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతను మత్తులో ముంచే ఈ పదార్థాల సరఫరా అంతర్రాష్ట్ర స్థాయిలో నడుస్తుండటంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. కేంద్రం ఇప్పటికే డ్రగ్‌ మాఫియాలపై కఠినచర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ పోలీసులు దాడులు, తనిఖీలను ముమ్మరం చేశారు.

ప్రతాప్‌గఢ్‌ జిల్లా పరిధిలోని ధారియావద్‌, దేవఘఢ్‌ పోలీస్‌ స్టేషన్ల సంయుక్త బృందాలుగా ఏర్పడి “ఆపరేషన్‌ చక్రవ్యుహ్‌” పేరుతో ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కోట్ల రూపాయల విలువైన పోస్తాడోడా పట్టిని (నల్లమందు తొక్కలు) స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణా పట్టివేత ఈ ఇటీవల పట్టుబడిన అతిపెద్ద సరుకులలో ఒకటిగా అధికారులు పేర్కొన్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం జవహర్‌నగర్‌ క్రాస్‌రోడ్స్ వద్ద తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ లోడింగ్‌ వాహనాన్ని ఆపాలని సంకేతం ఇచ్చారు. కానీ డ్రైవర్‌ ఆగకుండా వాహనాన్ని వేగంగా తీసుకువెళ్లాడు. అనుమానం వచ్చి అధికారులు ఆ వాహనాన్ని వెంబడించడంతో డ్రైవర్‌, వాహనంలో ఉన్న మరోవ్యక్తి వాహనాన్ని రోడ్డుపక్కన వదిలి అడవిలోకి పరారయ్యారు. పోలీసులు ఆ లోడింగ్ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో మొత్తం 49 సంచులు కనిపించాయి. వాటిని పరిశీలించగా వాటిలో దాదాపు 10.73 క్వింటాళ్ల పోస్తా డోడా పట్టి ఉన్నట్లు నిర్ధారించారు.

పోలీసులు వెంటనే ఆ వాహనాన్ని నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని ధరియావద్ పోలీస్ స్టేషన్‌లో నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి ఈ మాదకద్రవ్యాల అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠాను, మూలాలను గుర్తించేందుకు, పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

రూ.1.6 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్‌ - Tholi Paluku