
రూ. 2.46 కోట్ల సైబర్ స్కామ్
చదువులో టాపర్… యూకేలో డాక్టరేట్ పట్టా… యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేసిన ప్రతిభావంతుడు. అలాంటి వ్యక్తే నేరమార్గం ఎంచుకొని కోట్ల రూపాయల సైబర్ నేరానికి పాల్పడిన ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. కాగా పూణే లోని ఓ ప్రైవేటు యూనివర్సిటీ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు మొదట తన విద్య అర్హత గురించి చెప్పి, తాను ఐఐటీ ఫ్యాకల్టీ సభ్యుడిగా పరిచయం చేసుకున్నాడు. అనంతరం తమ కాలేజీకి భారీ పరిశోధన ప్రాజెక్టులు ఇప్పిస్తానని నమ్మించాడు. నిందితుడి మాటలను నమ్మిన యూనివర్సిటీ యాజమాన్యం నిందితుడితో చేతులు కలిపింది. కాలేజీ వారి నమ్మకాన్ని అదునుగా తీసుకుని నేరగాడు ప్రాజెక్ట్ కోసం కొంత డబ్బు అవుతుంది అని చెప్పడంతో యూనివర్సిటీ అధికారులు జూలై 25 నుండి ఆగస్టు 26 మధ్య కాలంలో వివిధ బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ. 2.46 కోట్లను బదిలీ చేసింది. కాగా డబ్బు అందిన వెంటనే నిందితుడు కాలేజీ వారితో కాంటాక్ట్‌లు కట్ చేయడంతో అనుమానం కలిగి యూనివర్సిటీ అధికారులు ఈ నెల ప్రారంభంలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఫిర్యాదు వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బ్యాంకు లావాదేవీలు, ఖాతాలను పరిశీలిస్తూ నిందితుడి గురించిన ఆధారాలను కనుగొన్నారు. చివరికి అతడిని హైదరాబాద్‌లోని యాప్రల్ ప్రాంతంలో గుర్తించి సెప్టెంబర్ 21న అరెస్ట్ చేశారు.
సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో నిందితుడిని హైదరాబాద్ యాప్రల్‌కు చెందిన కిలారు సీతయ్య (34)గా గుర్తించారు. సీతయ్య ఈ మోసానికి ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు.అంతేకాక సీతయ్యకు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో యూకే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టాపొందినట్టు తెలిపారు. అదేవిధంగా 2019-20లో యూపీఎస్సీ ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాదించాడన్న విషయం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా ఈ మోసానికి ప్రధాన సూత్రధారి అయిన సీతయ్యను కోర్టులో హాజరుపరచాగ విచారణ కోసం సెప్టెంబర్ 28 వరకు పోలీసు కస్టడీకి తరలించాలని కోర్టు తీర్పునిచ్చింది అధికారులు వెల్లడించారు.
మరోవైపు సైబర్ క్రైమ్ అధికారులు విద్యాసంస్థలకు ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టులు, పరిశోధనల పేరుతో ఎవరైనా సంప్రదిస్తే వెంటనే వారి గుర్తింపు వివరాలు ధృవీకరించు కోవాలని సూచించారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఇలాంటి ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా విద్యా సంస్థలు, స్టార్టప్ కంపెనీలు లక్ష్యంగా మారుతున్నాయని అధికారులు తెలిపారు. ఇక కేసు దర్యాప్తు అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం పోలీసులు డబ్బు లావాదేవీల విషయమై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారని అంతేకాక ఈ నేరంలో ఇంకా ఎవరెవరు పాలుపంచుకున్నారనే అన్నదానిపై విచారణ జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
