
రూ . 14 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం
రాష్ట్ర వ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టడంలో పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల గ్వాలియర్, ఇండోర్, భోపాల్ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడగా, తాజాగా అగర్ మాల్వా జిల్లాలో పోలీసులు రూ.14 లక్షల విలువైన ఎండి (మెఫెడ్రోన్) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ వినోద్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, బరోడ్ మున్సిపాలిటీ ఎదుట ఉన్న వంతెన దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తి కనిపించడం తో తమకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే అప్రమత్తమైన ఒక ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతని పేరు సునీల్ శర్మ అని తేలింది. సునీల్ వద్ద లభించిన సమాచారం ఆధారంగా, ఈ మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లో భాగమైన మరో వ్యక్తి సంజయ్ సూర్యవంశిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరి నుంచి మొత్తం 140 గ్రాముల ఎండి డ్రగ్(మెఫెడ్రోన్) స్వాధీనం చేసుకున్నారు.
ఇక అధికారుల అంచనా ప్రకారం, పట్టుబడిన డ్రగ్ మార్కెట్ విలువ లక్షల్లో ఉండడంతో, పోలీసులు ఇద్దరిపై నార్కోటిక్ చట్టాల కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇక నిందితులిద్దరికి ఎవరెవరితో సంబంధముంది? అదేవిదంగా ఈ డ్రగ్ సరఫరా నెట్‌వర్క్ వెనుక ఉన్నది ఎవరు అనే దానిపై లోతైన దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
ఎస్పీ సింగ్ మాట్లాడుతూ ఎండి డ్రగ్ వాడకం అత్యంత ప్రమాదకరం. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర దెబ్బతీయడమే కాక ముఖ్యంగా యువతను వ్యసనానికి బానిసలుగా మార్చి వారి భవిష్యత్తును నాశనం చేస్తుంది. అందుకే ఇటువంటి నేరాలను అరికట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా నిఘా బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు
