Let's talk: editor@tmv.in
రూ. 12 కోట్ల పాకిస్తాన్ సరుకులు సీజ్

రూ. 12 కోట్ల పాకిస్తాన్ సరుకులు సీజ్

Panthagani Anusha
15 సెప్టెంబర్, 2025

దేశ భద్రతా పరిస్థితులు, ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్తాన్ వస్తువుల దిగుమతిపై ప్రభుత్వం పూర్తి నిషేధం విధించినా స్మగ్లింగ్ గ్యాంగులు అక్రమ మార్గాల్లో వాటిని భారత్లోకి అక్రమంగా తరలించే ప్రయత్నాలు ఆపడం లేదు. తాజాగా నావా శేవా పోర్టులో డీఆర్ఐ అధికారులు పెద్ద రాకెట్ను బట్టబయలు చేశారు. పాకిస్తాన్ నుంచి తెప్పించిన డ్రై డేట్స్, కాస్మెటిక్స్తో నిండిన 28 కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.12 కోట్లు ఉంటుందని ఉండవచ్చుఅని వెల్లడించారు. కాగా ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

పోలీసులు జరిపిన విచారణలో భాగంగా ముగ్గురు భారతీయ దిగుమతిదారులు నిషేధాన్ని అతిక్రమించి ఈ సరుకులు తెప్పించినట్లు అధికారులు తెలిపారు. దుబాయ్లో నివసిస్తున్న ఒక భారతీయుడు నకిలీ బిల్లులు తయారు చేసి సరుకులు యూఏఈ నుంచి వచ్చినట్లుగా చూపించాడు. కానీ దర్యాప్తులో అవి పాకిస్తాన్ నుంచే వచ్చినవని తేలింది. ఈ అక్రమ రవాణాలో పాకిస్తాన్, భారత్, యూఏఈ వ్యాపారులు కలిసి పనిచేసినట్లు సమాచారం.

“ఆపరేషన్ దీప్ మానిఫెస్ట్” పేరుతో చేపట్టిన దాడిలో అధికారులు భారీ మొత్తంలో సరుకులను పట్టుకున్నారు. సుమారు 800 టన్నుల డ్రై డేట్స్, కాస్మెటిక్స్ స్వాధీనం కాగా, ఈ అక్రమ దిగుమతిలో పాకిస్తాన్, భారత్, యూఏఈ దేశాలకు చెందిన వ్యాపారులు కలిసి పనిచేసినట్లు విచారణలో తేలింది.

మరోవైపు ఏప్రిల్లో పహాల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో కేంద్రం మే 2న పాకిస్తాన్ వస్తువుల దిగుమతులపై పూర్తి నిషేధం విధించింది. ఆ తర్వాత డీఆర్ఐ దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి ఈ తరహా స్మగ్లింగ్ను అడ్డుకుంటోంది. ప్రస్తుతం ఈ కేసు మీద మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. అక్రమ వాణిజ్యానికి పాల్పడిన వారికి కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.

రూ. 12 కోట్ల పాకిస్తాన్ సరుకులు సీజ్ - Tholi Paluku