Let's talk: editor@tmv.in
రోహిత్‌, రికెల్టన్‌ మెరుపులు .. బోణీ కొట్టిన ముంబై ఇండియ‌న్స్‌
రోహిత్‌, రికెల్టన్‌ మెరుపులు .. బోణీ కొట్టిన ముంబై ఇండియ‌న్స్‌

రోహిత్‌, రికెల్టన్‌ మెరుపులు .. బోణీ కొట్టిన ముంబై ఇండియ‌న్స్‌

Shaik Mohammad Shaffee
30 మార్చి, 2026

ఐపీఎల్‌లో 13 ఏళ్లుగా ముంబై ఇండియన్స్‌ (ఎంఐ)ను వెంటాడుతున్న ‘తొలి మ్యాచ్’ శాపం ఎట్టకేలకు వీడింది. గత 13 ఎడిషన్లుగా ఆరంభ పోరులో ఓడిపోతున్న ముంబై, ఈసారి మాత్రం వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్)పై రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన హోరాహోరీ పోరులో రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ వీరోచిత బ్యాటింగ్‌తో 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై మరో 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 2012 తర్వాత ముంబైకి లీగ్ ఆరంభంలో దక్కిన తొలి విజయం ఇదే కావడం విశేషం.

హిట్ మ్యాన్ విన్యాసాలు.. రికెల్టన్ ధాటి

గత ఐపీఎల్ తర్వాత మళ్లీ ఇప్పుడే టీ20 బరిలోకి దిగిన రోహిత్ శర్మ (78; 38 బంతుల్లో, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) తనలో వాడి ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ముజరబానీ వేసిన నాలుగో ఓవర్లో క్రీజు వెలుపలికి వచ్చి కొట్టిన సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. కేవలం 23 బంతుల్లోనే రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు ర్యాన్ రికెల్టన్ (81; 43 బంతుల్లో, 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నరైన్, చక్రవర్తి వంటి స్పిన్ దిగ్గజాలను సైతం లెక్కచేయకుండా లెగ్ సైడ్ బౌండరీలే లక్ష్యంగా సిక్సర్ల వర్షం కురిపించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు కేవలం 72 బంతుల్లోనే 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ముంబై విజయాన్ని ఖాయం చేశారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (18 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు.

రహానే మెరుపులు.. కేకేఆర్ భారీ స్కోరు

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ అజింక్య రహానే (67; 40 బంతుల్లో, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) పాత రోజులను గుర్తు చేస్తూ అద్భుతమైన టైమింగ్‌తో అలరించాడు. యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ (51) కూడా అర్ధశతకంతో రాణించడంతో కేకేఆర్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఫిన్ అలెన్ (37) ఆరంభంలోనే హార్దిక్ పాండ్యా వేసిన ఒకే ఓవర్లో 26 పరుగులు పిండుకోవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి కేకేఆర్ 78/1తో పటిష్ట స్థితిలో నిలిచింది.

కట్టడి చేసిన బుమ్రా.. శార్దూల్ కీలక వికెట్లు

ఒక దశలో కేకేఆర్ 250 పరుగులు చేసేలా కనిపించినా, ముంబై బౌలర్లు డెత్ ఓవర్లలో అద్భుతంగా పుంజుకున్నారు. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ (3/39) కీలక సమయంలో రహానే, కామెరాన్ గ్రీన్ వికెట్లను తీసి ముంబైని రేసులోకి తెచ్చాడు. సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా (0/35), ట్రెంట్ బౌల్ట్ (0/38) వికెట్లు తీయలేకపోయినా.. బుమ్రా వేసిన 18, 20వ ఓవర్లు కేకేఆర్ స్కోరును కట్టడి చేశాయి. అరంగేట్రం చేసిన స్పిన్నర్ అల్లా గజన్ఫర్ 51 పరుగులు సమర్పించుకొని ఒత్తిడికి గురయ్యాడు.

రోహిత్‌, రికెల్టన్‌ మెరుపులు .. బోణీ కొట్టిన ముంబై ఇండియ‌న్స్‌ - Tholi Paluku