
రోహిత్, కోహ్లీకైనా గౌరవం ఇవ్వండి: అశ్విన్
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్లీ భారత సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నారు. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న వీరిద్దరూ రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్‌కు కీలక సూచనలు చేస్తూ, యువ పేసర్ హర్షిత్ రాణా ఎంపికపై, తన రిటైర్‌మెంట్ నిర్ణయంపై కూడా స్పందించారు.
కోహ్లీ, రోహిత్‌కు గౌరవం ఇవ్వండి
కెరీర్ చివరి దశలో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు టీమిండియా మేనేజ్‌మెంట్ సరైన గౌరవం ఇవ్వాలని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించారు. వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి, యువకులకు అవకాశం ఇవ్వడం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయంగా అనిపించినా, సీనియర్ల విషయంలో మెరుగ్గా వ్యవహరించాలని అశ్విన్ కోరారు. "కాయిన్‌కు ఒకవైపు సెలక్షన్ కమిటీ, మరోవైపు కోహ్లీ-రోహిత్ ఉన్నారు. కెరీర్ చివరి దశలో ఉన్న వారిద్దరి విషయంలోనైనా మెరుగైన రీతిలో వ్యవహరించాలి. అభిమానుల నుంచి కూడా ఇలాంటి ఆకాంక్షలు ఉన్నాయి" అని అశ్విన్ అన్నారు.
మేనేజ్‌మెంట్ కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సీనియర్‌లను త్వరగా వీడ్కోలు చెప్పాలని కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోందని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలోనే సరైన కమ్యూనికేషన్ అవసరమన్నారు. "మీరు భారత్ 'ఏ' తరఫున ఆడితేనే వరల్డ్ కప్ జట్టులో చోటు ఇస్తామని వారికి ముందుగానే స్పష్టమైన సమాచారం ఇవ్వండి. దేశవాళీ క్రికెట్‌లోనూ ఆడాలని చెప్పండి" అని అశ్విన్ సూచించారు. తద్వారా సీనియర్లను గౌరవిస్తూనే, యువ ఆటగాళ్ల కోసం భవిష్యత్ ప్రణాళికలను అమలు చేయవచ్చని ఆయన పరోక్షంగా తెలిపారు.
హర్షిత్ రాణా ఎంపికపై ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి
ఆస్ట్రేలియా పర్యటనకు ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఎంపికపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ, విమర్శలను అశ్విన్ ప్రస్తావించారు. అతడి ఎంపిక ఎలా జరిగిందో తాను కూడా తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే రాణాపై ప్రతికూల వ్యాఖ్యలు చేయవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
"ఆస్ట్రేలియా గడ్డపై బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల ప్లేయర్ కావాలి. రాణా బ్యాటింగ్ చేయగలడు. ఎనిమిదో స్థానంలో పరుగులు చేసే సత్తా అతడికి ఉందని మేనేజ్‌మెంట్ నమ్మకంతో ఉంది" అని అశ్విన్ పేర్కొన్నారు. రాణా బౌలింగ్‌పై సందేహాలు వ్యక్తం చేయడం సరికాదని చెబుతూ, "కొన్నిసార్లు నమ్మకంతో జట్టులోకి ఎంపిక చేస్తారు. అతడు అర్హుడా? కాదా? అనేది తర్వాత సంగతి. అతడు కీలక పాత్ర పోషిస్తాడా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం. అందుకే ఎవరూ కూడా వ్యక్తిగతంగా రాణాపై ట్రోల్ చేయొద్దు" అని అశ్విన్ విజ్ఞప్తి చేశారు. జట్టు మేనేజ్‌మెంట్ నమ్మకంపై గౌరవం ఉంచాలని సూచించారు.
రిటైర్‌మెంట్ నా వ్యక్తిగత నిర్ణయం
రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్‌మెంట్ నిర్ణయంపై వస్తున్న ఊహాగానాలపైనా స్పందించారు. గత సంవత్సరం ఆస్ట్రేలియా టెస్ట్ పర్యటన మధ్యలో క్రికెట్‌కు వీడ్కోలు పలకడం తన వ్యక్తిగత నిర్ణయం అని, తనను ఎవరూ బలవంతం చేయలేదు అని స్పష్టం చేశారు. 39 ఏళ్ల అశ్విన్, గత ఏడాది బ్రిస్బేన్‌లో జరిగిన 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడవ టెస్ట్ తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది ఆగస్టులో ఐపీఎల్ నుంచి కూడా తప్పుకున్నారు.
"మీరు తప్పుకోవాలి అని నాతో ఎవరూ చెప్పలేదు. జట్టులో మీకు స్థానం లేదు అని కూడా ఎవరూ చెప్పలేదు. నిజానికి, నేను ఈ నిర్ణయం తీసుకునే ముందు ఇద్దరు, ముగ్గురు వద్దని చెప్పారు. వారు నేను ఆడాలని కోరుకున్నారు” అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపారు. "అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆలోచించమని చెప్పాడు. గౌతమ్ గంభీర్ కూడా మరోసారి ఆలోచించమని నాతో చెప్పారు. కానీ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్‌తో నేను దాని గురించి పెద్దగా మాట్లాడలేదు. రిటైర్మెంట్ చాలా వ్యక్తిగత నిర్ణయం" అని అశ్విన్ వివరించారు.
