Let's talk: editor@tmv.in
రోడ్డు భద్రత మనందరి బాధ్యత: కూకట్‌పల్లిలో 'అరైవ్ అలైవ్' హెల్మెట్ల పంపిణీ

రోడ్డు భద్రత మనందరి బాధ్యత: కూకట్‌పల్లిలో 'అరైవ్ అలైవ్' హెల్మెట్ల పంపిణీ

Gaddamidi Naveen
25 జనవరి, 2026

కూకట్‌పల్లి ప్రాంతంలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు భద్రతపై కీలక సందేశాన్ని అందించారు.

“స్టార్ట్ ఎర్లీ – గో స్లోలీ – రీచ్ సేఫ్లీ” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అమలు చేయాలని సీపీ పిలుపునిచ్చారు. ప్రయాణం ప్రారంభించే ముందు సరైన ప్రణాళికతో ముందుగానే బయలుదేరి, వేగం తగ్గించి, గమ్యానికి సురక్షితంగా చేరుకోవడమే రోడ్డు ప్రమాదాలను నివారించే మార్గమని ఆయన వివరించారు.

ముఖ్యంగా యువత, విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా విలువైన ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవచ్చని హెచ్చరించారు.

జనవరి 13 నుంచి 23 వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. అందరం కలిసి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తేనే ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించగలమని, రోడ్డు భద్రతను జీవన విధానంగా మార్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

రోడ్డు భద్రత మనందరి బాధ్యత: కూకట్‌పల్లిలో 'అరైవ్ అలైవ్' హెల్మెట్ల పంపిణీ - Tholi Paluku