
రోడ్డు భద్రతపై ఆర్టీఏ సిబ్బందికి యూనిసెఫ్ ఆధ్వర్యంలో అవగాహన శిక్షణ
రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు యూనిసెఫ్ ఆధ్వర్యంలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నాన్ ఆఫీసియల్ మెంబర్స్ (ఆర్టీఏ సిబ్బందికి)కు రోడ్డు భద్రతపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం హోటల్ మెర్క్యూరీ లో జరిగింది. రవాణా శాఖ అధికారులతో సమన్వయంతో గ్రామీణ స్థాయి వరకు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
యూనిసెఫ్ ప్రతినిధి కీలక వివరాలు
శిక్షణలో యూనిసెఫ్ ప్రతినిధి డాక్టర్ శ్రీధర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ డాక్టర్ శైలజ ముఖ్య ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, “గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీస్ రిపోర్ట్ ప్రకారం 10 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతలో రోడ్డు ప్రమాదాలు ప్రధాన మరణ కారణం” అని తెలిపారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ మూడు దేశాలను ఎంపికచేసిందని, అందులో భారత్‌లో అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాలు ఎంపికయ్యాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రోజుకు సగటున 1,317 రోడ్డు ప్రమాదాలు, 477 మరణాలు నమోదవుతున్నాయని వివరించారు.
డాక్టర్ శైలజ మాట్లాడుతూ, రోడ్డు నిబంధనలపై అవగాహన విద్యార్థి దశ నుంచే పెంచాల్సిన అవసరముందని చెప్పారు. విద్యార్థులలో రోడ్డు భద్రతపై సాంఘిక బాధ్యత పెంపొందించేందుకు ఆక్టివ్, బ్లీడింగ్, కంట్రోల్ ప్రోగ్రామ్‌ను విస్తృతంగా అమలు చేయాలి అని సూచించారు.శిక్షణలో పాల్గొన్న అధికారులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్టాడుతూ.. గౌరవాన్ని కాపాడే విధంగా ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న సూచనలు ఇచ్చారు. రాబోయే “రోడ్ సేఫ్టీ మంత్”లో ఆర్టీఏ సిబ్బంది ప్రజలకు రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.
ఇటీవల కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాల తీరును ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రమాదాలను నివారించేందుకు స్కూల్స్, కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లో వ్యాసరచన పోటీలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. విజేతలకు బహుమతులు ప్రధానం చేసి, కరపత్రాలు పంపిణీ చేయాలని మంత్రి నిర్ణయించారు.కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన 8 రోజుల్లోపే గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు చికిత్స ఖర్చు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల్లో దీనిపై విస్తృత అవగాహన అవసరమని తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఆర్టీఏ నాన్ ఆఫీసియల్ మెంబర్స్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలని, అవగాహన ద్వారానే ప్రాణ నష్టం తగ్గించవచ్చని యూనిసెఫ్ ప్రతినిధులు స్పష్టం చేశారు.
యూనిసెఫ్ ప్రధాన కార్యకలాపాలు
యూనిసెఫ్ భారత్‌లో 1949 నుంచి పనిచేస్తోంది.ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పిల్లల ఆరోగ్యం, విద్య, సురక్షిత పర్యావరణం, రోడ్డు భద్రత వంటి అంశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
