Let's talk: editor@tmv.in
రోడ్డు భద్రతకు ఏఐ ఆధారిత వ్యవస్థ అభివృద్ధి: ఐఐటీ ఇండోర్

రోడ్డు భద్రతకు ఏఐ ఆధారిత వ్యవస్థ అభివృద్ధి: ఐఐటీ ఇండోర్

Pinjari Chand
13 జనవరి, 2026

దేశంలోని ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను మరింత స్మార్ట్‌గా, సురక్షితంగా మార్చే దిశగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఇండోర్ కొత్త కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాంకేతికతను అభివృద్ధి చేసిందని అధికారులు సోమవారం తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా వాహనదారులకు సకాలంలో హెచ్చరికలు పంపించి, రోడ్డు ప్రమాదాలను నివారించడమే కాకుండా వాహనాల రాకపోకలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వారు వెల్లడించారు.

ఈ సందర్భంగా పీటీఐతో మాట్లాడిన ఐఐటీ ఇండోర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ప్రభాత్ కుమార్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ, ప్రపంచం డ్రైవర్‌ లెస్ కార్ల దిశగా ముందుకు సాగుతున్న సమయంలో, దేశ ట్రాఫిక్ వ్యవస్థను స్మార్ట్‌గా, భద్రంగా మార్చడం అత్యంత అవసరమైందన్నారు. ఈ లక్ష్యంతో, ఏఐ, కమ్యూనికేషన్ సాంకేతికతను వినియోగించి తరువాతి తరం ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కోసం మేము ఈ కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు. ప్రొఫెసర్ వివరించిన ప్రకారం, ‘సెల్యులార్ వెహికిల్-టు-ఎవ్రీథింగ్ (సీ-వీ2ఎక్స్)’ అనే ఈ ఆధునిక సాంకేతికత ద్వారా కదులుతున్న వాహనాలు ఒకదానితో ఒకటి సులభంగా సమాచారాన్ని పంచుకోగలవు. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు సంభవించే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.

వైర్ లెస్ ఆధారంగా సేవలు

ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఆయన వివరిస్తూ ఒక వ్యక్తి కారు నడుపుతున్నప్పుడు, ముందు దారిలో ఉన్న రోడ్డు దుస్థితి, ప్రమాదాలు, ట్రాఫిక్ రద్దీ వంటి సమాచారం వెంటనే వాహనానికి చేరుతుంది. దీంతో డ్రైవర్ ముందుగానే అప్రమత్తంగా ఉండగలుగుతాడన్నారు. ఈ సమాచారాన్ని 4జీ ఎల్టీఈ, 5జీ వంటి హై-స్పీడ్ వైర్‌లెస్ నెట్‌వర్క్‌ల ద్వారా ప్రసారం చేస్తారని తెలిపారు. అయితే, సంప్రదాయ సెల్యులార్ వినియోగదారులు (మొబైల్ ఫోన్లు, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు) వాహనాల మధ్య సమయానికి కీలకమైన భద్రతా సందేశాలను పంచుకోవడంలో వైర్‌లెస్ వనరుల సమర్థ వినియోగం ఒక పెద్ద సవాలుగా ఉందన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు, ఐఐటీ ఇండోర్ పరిశోధక బృందం సరైన రిసోర్స్ అలొకేషన్ అల్గోరిథమ్‌లను అభివృద్ధి చేసింది. ఇవి రియల్‌టైమ్ ట్రాఫిక్ పరిస్థితులు, నెట్‌వర్క్ లోడ్, సిగ్నల్ నాణ్యత ఆధారంగా కమ్యూనికేషన్ వనరులను కేటాయించి, భద్రతకు అవసరమైన సందేశాలు తక్కువ సమయంలో, నమ్మదగిన విధంగా చేరేలా చేస్తాయని ప్రొఫెసర్ తెలిపారు.

ఈ సాంకేతికత ప్రాముఖ్యతను గురించి ఐఐటీ ఇండోర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుహాస్ జోషి వివరిస్తూ రోడ్డు భద్రత, స్థిరమైన రవాణా వ్యవస్థలు నేటి కాలంలో అత్యంత సవాళ్లుగా మారాయి. సీ-వీ2ఎక్స్ వంటి కనెక్టెడ్, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌లపై జరుగుతున్న పరిశోధనలు సురక్షిత రహదారులు, స్మార్ట్ నగరాల దిశగా ఒక విప్లవాత్మక అడుగు అని అన్నారు. ఐఐటీ ఇండోర్‌లో జరుగుతున్న ఈ పరిశోధన, ఆధునిక కమ్యూనికేషన్ సాంకేతికతలను బలమైన ఇంజినీరింగ్ పరిశోధనతో కలిపి, ప్రాణాలు కాపాడే, ట్రాఫిక్ రద్దీ తగ్గించే, అలాగే భవిష్యత్తు ఆటోనమస్ మొబిలిటీకి భారత్‌ను సిద్ధం చేసే పరిష్కారాలను అందించగలదని ఆయన తెలిపారు.

ఘనంగా దిశ 2.0 కార్యక్రమం

కేంద్ర ప్రభుత్వ విజ్ఞాన సాంకేతిక శాఖ (డీఎస్టీ) ఆధ్వర్యంలోని నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్‌డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ లో భాగంగా అమలవుతున్న దిశ 2.0 కార్యక్రమం, దేశవ్యాప్తంగా స్కేలబుల్ డిజిటల్ హెల్త్ టెక్నాలజీల అభివృద్ధికి కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో, ఐఐటీ ఇండోర్‌లో నిర్వహించిన దిశ 2.0 అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్న స్టార్టప్‌లు, పరిశోధనా ప్రాజెక్టులు, ఫెలోలను సత్కరించారు.