Let's talk: editor@tmv.in
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

Gaddamidi Naveen
14 ఏప్రిల్, 2026

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్డు భద్రతపై కీలకమైన అడుగు వేశారు. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో 'ప్రజా పాలన ప్రగతి' కార్యక్రమంలో భాగంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా ప్రచార పోస్టర్‌ను ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ నెల 13 నుంచి 18 వరకు పోలీస్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా కమిషనర్ ఇలంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలను గుర్తించడం, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా పర్యావరణ పరిరక్షణకు రవాణా శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో ఆరు రోజులపాటు శాఖల సమీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యమని, మానవ ప్రాణాల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన అన్నారు.

అత్యవసర వైద్య సహాయంపై మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే "గోల్డెన్ అవర్" (మొదటి గంట) లోపు బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం తరపున 'రహవీర్ అవార్డు' అందజేస్తామని మంత్రి తెలిపారు. చెక్ పోస్టుల తొలగింపు వంటి సంస్కరణలు ఇప్పటికే అమలు చేశామని, అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 30 ఏళ్లపాటు ఎటువంటి ప్రమాదం లేకుండా విధులు నిర్వహించిన ఆర్టీసీ డ్రైవర్లను సత్కరించనున్నట్లు కూడా వెల్లడించారు. ప్రతి జిల్లాలో రోడ్ సేఫ్టీ సమావేశాలు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఆర్టీసీ సమ్మె అంశంపై స్పందిస్తూ, ఆర్టీసీ ప్రభుత్వ విలీన ప్రతిపాదన ప్రస్తుతం కమిటీ పరిశీలనలో ఉందని తెలిపారు. మిగిలిన సమస్యలపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ప్రేరేపిత సమ్మెలకు లోనవవద్దని ఉద్యోగులకు సూచించారు. పెండింగ్ డీఏ ఇప్పటికే విడుదల చేశామని, పీఆర్సీపై ప్రభుత్వం పరిశీలనలో ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రమాద రహిత తెలంగాణను నిర్మించేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు.