Let's talk: editor@tmv.in
రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖకు కఠిన ఆదేశాలు: మంత్రి పొన్నం

రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖకు కఠిన ఆదేశాలు: మంత్రి పొన్నం

Gaddamidi Naveen
4 నవంబర్, 2025

రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై రవాణా శాఖకు కఠిన ఆదేశాలు చేశారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులతో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్‌ నేతృత్వంలో కీలక జూమ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కమిషనర్‌ ఇలాంబర్తి, జేటీసీలు, డీటీసీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వరుస ప్రమాదాలు జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. సోమవారం జరిగిన ప్రమాదంలో రెండు వాహనాలకు ఫిట్నెస్‌ ఉన్నప్పటికీ, రహదారి ఇరుకు కావడం, డివైడర్‌ లేకపోవడం వల్లే తీవ్ర ప్రమాదం జరిగిందని చెప్పారు. వాహనాల స్పీడ్‌ లాక్‌ అమలుపై సమీక్ష చేయాలని, దాన్ని ఉల్లంఘిస్తే ట్రిపుల్‌ పెనాల్టీ విధించాలని ఆదేశించారు.

రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్‌ విభాగం సీరియస్‌గా, నిరంతరం యాక్టివ్‌గా పనిచేయాలని సూచించారు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే కాకుండా, నిరంతర యాక్షన్‌ ప్లాన్‌తో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు వేధింపులు లేకుండా, నిబంధనల ప్రకారం కఠినంగా కానీ న్యాయంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.అలాగే, టిప్పర్‌ లారీలు ఇసుక, డస్ట్‌ తరలింపులో టార్పలిన్‌ తప్పనిసరిగా కప్పుకోవాలని ఆదేశించారు. డీటీసీ, ఆర్టీవోలు ప్రతి జిల్లాలో మూడు బృందాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. రైతులు ధాన్యం తరలింపులో ఉపయోగించే వాహనాలపై వేధింపులు చేయవద్దని హెచ్చరించారు.

కమర్షియల్‌ వాహనాలు, ప్రయాణికుల బస్సులు, మైనింగ్‌ వాహనాలు, స్లీపర్‌ బస్సులు నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్కూల్‌ బస్సులు, ట్రక్కులు, టిప్పర్లు, లారీలు ఫిట్నెస్‌, పర్మిట్‌లను క్రమం తప్పకుండా పరిశీలించేలా ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే రోడ్‌ సేఫ్టీ మంత్‌ లో ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన సూచించారు.

రోడ్‌ సేఫ్టీ మంత్ అంటే?

జాతీయ రోడ్డు భద్రతా నెల రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వలు అన్ని రాష్ట్రాల్లో జనవరి 1 నుంచి జనవరి 31 వరకూ ఈ నెలలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, ప్రజల్లో రహదారి నియమాలపై అవగాహన పెంచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖకు కఠిన ఆదేశాలు: మంత్రి పొన్నం - Tholi Paluku