
రోడ్డుపై ‘డ్యాన్స్’ చేసినందుకు ట్రాఫిక్ పోలీస్ కు డిమోషన్
ఇండోర్ నగరంలో రోడ్లపై ట్రాఫిక్ నిర్వహణ చేస్తూ మైఖేల్ జాక్సన్ తరహాలో ‘మూన్‌వాక్’ చేస్తూ వైరలవుతూ ఫేమస్ అయిన ట్రాఫిక్ పోలీస్ రంజిత్ సింగ్‌పై శాఖాపరమైన చర్యలు చేపట్టారు. క్రమశిక్షణకు విరుద్ధంగా సోషల్ మీడియాలో ప్రవర్తించాడన్న కారణంతో అతడిని హెడ్ కానిస్టేబుల్ పదవి నుంచి కానిస్టేబుల్ స్థాయికి తగ్గించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. రంజిత్ సింగ్‌కు 2021లో పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఆదేశాల మేరకు ఆఫిషియేటింగ్ హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించిందని, అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ‘అనుచిత ప్రవర్తన’గా భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేశ్ దండోటియా తెలిపారు.
ఇదిలా ఉండగా, గత ఏడాది ఒక మహిళకు సోషల్ మీడియాలో అనుచిత సందేశాలు పంపాడన్న ఆరోపణల నేపథ్యంలో కూడా రంజిత్ సింగ్‌పై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. ఆ మహిళ విడుదల చేసిన వీడియోలో, కొద్దికాలం పరిచయం తర్వాత ఇండోర్‌కు రావాలని, విమాన టికెట్లు ఏర్పాటు చేస్తానని సింగ్ సందేశాలు పంపాడని ఆరోపించింది. ఈ ఆరోపణలను సింగ్ ఖండిస్తూ, తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కావాలనే ఈ ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందడానికే ఆమె ఇలా చేస్తున్నారని ప్రతి స్పందనగా వీడియో విడుదల చేశాడు. ఈ వివాదం నేపథ్యంలో అప్పట్లోనే రంజిత్ సింగ్‌ను ఫీల్డ్ డ్యూటీ నుంచి తొలగించారు. పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్న రంజిత్ సింగ్, రద్దీగా ఉండే రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ డాన్స్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో విస్తృత గుర్తింపు పొందాడు. అయితే అదే శైలి ఇప్పుడు అతడి కెరీర్‌కు ఆటంకంగా మారింది.
ప్రభుత్వ ఉద్యోగంలో రీల్స్‌పై నిషేధం లేదు..నిబంధనల ఉల్లంఘనే కారణం
ఇండోర్ ట్రాఫిక్ పోలీసు డిమోషన్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాలో రీల్స్ చేయడంపై చర్చ మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ రీల్స్ చేయడం పూర్తిగా నిషేధం కాదని, అయితే డ్యూటీ సమయంలో, యూనిఫాం ధరించి, శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వీడియోలు చేయడం సేవా నిబంధనలకు విరుద్ధం అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇండోర్ ట్రాఫిక్ పోలీసు డ్యాన్స్ వీడియోలు డ్యూటీ సమయంలో రోడ్డుపై తీసినవిగా గుర్తించడంతో పాటు, గతంలో సోషల్ మీడియా సంబంధిత వివాదాలు ఉండటంతో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యగా డిమోషన్ విధించినట్లు తెలిపారు. వ్యక్తిగత సమయంలో, నిబంధనలు పాటిస్తూ వీడియోలు చేయడంపై సాధారణంగా చర్యలు ఉండవని అధికారులు పేర్కొన్నారు.
