
రోజుకు 25 వేల రైళ్లు నడుస్తున్నాయి: రైల్వేమంత్రి
2025–26 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలు 76,352 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు సుమారు 25 వేల రైళ్లు నడుస్తున్నాయని ఆయన చెప్పారు. గత దశాబ్దంలో రైల్వే రంగంలో చేసిన భారీ పెట్టుబడుల ఫలితంగా పేదలు, మధ్యతరగతి ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతోందని ఆయన వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రైల్వే అభివృద్ధికి రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రైల్వేలు దేశంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ప్రధాన ప్రయాణ సాధనమని ఆయన అన్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు సరుకు రవాణాలో కూడా రికార్డు సృష్టించాయి. మొత్తం 1,670 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరిగింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 3.25 శాతం అధికం. ఇనుప ఖనిజ రవాణా 6.73 శాతం, సిమెంట్ రవాణా 3.41 శాతం పెరిగిందని మంత్రి తెలిపారు. భద్రత పరంగా కూడా గణనీయమైన పురోగతి నమోదైందని ఆయన చెప్పారు. గత 50 సంవత్సరాల్లో కనిష్టంగా కేవలం 16 ప్రధాన ప్రమాదాలు మాత్రమే నమోదయ్యాయని వెల్లడించారు. ఇక ప్రయాణికుల సౌకర్యాల కోసం దేశవ్యాప్తంగా 76 రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ప్రయాణికుల హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేసే సమగ్ర ప్రణాళికను రైల్వే శాఖ ప్రారంభించింది. ఈ ప్రాంతాల్లో కూర్చునే సౌకర్యాలు, తాగునీరు, టికెట్ కౌంటర్లు, సమాచార డిస్‌ప్లేలు, భద్రతా తనిఖీలు వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద ఇప్పటికే నమూనా హోల్డింగ్ ఏరియా ప్రారంభించామని మంత్రి తెలిపారు. అక్కడ అదనపు టికెట్ కౌంటర్లు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్, సీసీటీవీ నిఘా, లగేజ్ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు, అగ్నిమాపక వ్యవస్థలు వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సదుపాయాలతో ప్లాట్‌ఫారమ్‌ల వద్ద రద్దీ తగ్గి, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
