
రోజంతా ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్
ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఖండాలా ఘాట్ ప్రాంతంలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో 24 గంటలపాటు ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఈ ప్రమాదం కారణంగా వందలాది వాహనాలు ఇరుక్కుపోయి, రెండు దిశలలోనూ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. ప్రమాద స్థలానికి సమీపంలో వాహనాలు రాత్రంతా కదలకుండా నిలిచిపోవడంతో మహిళలు, పిల్లలు సహా ప్రయాణికులు ఆహారం, నీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్‌వే కంట్రోల్ రూమ్ తెలిపిన వివరాల ప్రకారం, అత్యంత మండే స్వభావం ఉన్న ప్రొపిలిన్ గ్యాస్‌ను మోసుకెళ్తున్న ట్యాంకర్ మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో రద్దీగా ఉండే ఖండాలా ఘాట్ సెక్షన్‌లో బోల్తా పడింది. ఈ ఘటనతో ట్రాఫిక్ బుధవారం సాయంత్రం వరకు అంతరాయం కలిగింది. అంటే దాదాపు 24 గంటల పాటు కొనసాగింది.
ట్యాంకర్ నుంచి ఇంకా గ్యాస్ లీక్ అవుతుండటంతో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) బృందాలను రంగంలోకి దింపారు. పరిస్థితి అదుపులోకి రావడానికి చర్యలు కొనసాగుతున్నాయని, రాత్రి ఆలస్యంగా మాత్రమే సాధారణ ట్రాఫిక్ పునరుద్ధరణ సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. గ్యాస్‌ను మరో ట్యాంకర్‌కు మార్చే ప్రక్రియ కొనసాగుతోందని, ఈ మొత్తం ఆపరేషన్‌కు రెండు గంటలకు పైగా సమయం పడుతుందని ఒక పోలీసు అధికారి చెప్పారు. ఈ ప్రమాదం నేపథ్యంలో పుణే నుంచి ముంబై వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేసి, ట్రాఫిక్‌ను పాత ముంబై–పుణే జాతీయ రహదారిపైకి మళ్లించారు. అలాగే, 15–20 నిమిషాల విరామాల మధ్య పుణే వైపు ఉన్న లేన్‌లోంచి ముంబై వైపు వాహనాలను అనుమతించడం వల్ల కొంతమేర ట్రాఫిక్ తగ్గిందని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర రాష్ట్ర రహదారి అభివృద్ధి సంస్థ ప్రకారం, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముంబై వైపు వెళ్లే లేన్‌ను మూసివేయడంతో రెండు దిశలలోనూ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అవసరం లేకపోతే ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణం చేయవద్దని హైవే ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
భారతదేశంలో తొలి 6-లేన్ కాంక్రీట్ టోల్ ఎక్స్‌ప్రెస్‌వే అయిన ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్‌వే పొడవు 94.5 కిలోమీటర్లు. ఇది ముంబై, రాయగఢ్, నవీ ముంబై ప్రాంతాలను పుణేతో కలుపుతుంది.రాయగఢ్ జిల్లాలోని అడోషి సొరంగం సమీపంలో, అధిక వేగంతో వస్తున్న ట్యాంకర్ దిగువ వైపు వాలు కారణంగా నియంత్రణ తప్పి బోల్తా పడినట్టు అధికారులు తెలిపారు. వెంటనే గ్యాస్ లీక్ కావడంతో వాహనదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముంబై వైపు ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఒక ఎంఎస్ఆర్టీసీడ్రైవర్ మాట్లాడుతూ, అడోషి సొరంగం సమీపంలో తొమ్మిది గంటలపాటు బస్సు కదలకుండా నిలిచిపోయిందని, చివరకు బుధవారం ఉదయం 3 గంటలకు నవి ముంబైలోని పన్‌వెల్‌కు చేరుకున్నామని చెప్పారు. మరుగుదొడ్లు లేక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, రూ.10 నీటి బాటిల్‌ను రూ.30కు అమ్మారని వాపోయారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఎక్స్‌ప్రెస్‌వేను పార్కింగ్ లాట్ గా అభివర్ణించారు. గ్యాస్ లీక్ పూర్తిగా ఆగి, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు నిపుణుల బృందాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు.
