Let's talk: editor@tmv.in
రో-కోతో నా బంధం చెక్కుచెదరలేదు: గిల్

రో-కోతో నా బంధం చెక్కుచెదరలేదు: గిల్

Shaik Mohammad Shaffee
19 అక్టోబర్, 2025

భారత క్రికెట్‌లో కొత్త శకం మొదలైంది. యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తొలిసారిగా అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడబోతున్నారు. నేడు పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో తమ అనుబంధంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గిల్ ఖండించారు.

"బయట ఎలాంటి కథనాలు అల్లినా, మా మధ్య ఎలాంటి మార్పు లేదు. అంతా పాత రోజుల్లాగే ఉంది. రోహిత్ భాయ్, విరాట్ భాయ్ ఇద్దరూ నాకు ఎంతో సహాయం చేస్తారు. వారి అనుభవాలను పంచుకోవడానికి వారు ఏమాత్రం సంకోచించరు" అని గిల్ స్పష్టం చేశాడు. ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వంటి దిగ్గజాలు సృష్టించిన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం పెద్ద బాధ్యత అని గిల్ అన్నారు.

"ఈ సిరీస్‌లో కష్టమైన పరిస్థితులు ఎదురైతే, వారిద్దరి సలహా తీసుకోవడానికి నేను అస్సలు సంకోచించను. క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వారిని అడుగుతా. నా స్థానంలో ఉంటే వారు ఎలా ఆలోచిస్తారో గమనిస్తూనే ఉంటా" అని గిల్ అన్నారు. జట్టును ఎలా నడిపించాలి అనే దానిపై తాను రోహిత్, విరాట్‌తో ఇప్పటికే పలుమార్లు చర్చించానని, వారి అనుభవాలు జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయని వెల్లడించారు.

"నేను చిన్నప్పుడు వారి ఆటను చూస్తూ పెరిగాను. వారి ఆట తీరు, పరుగులు సాధించాలనే వారి కసి నాకు స్ఫూర్తినిచ్చాయి. ఇంతటి దిగ్గజ క్రికెటర్లకు నాయకత్వం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం" అని గిల్ అన్నారు. కెప్టెన్సీ బాధ్యతను తాను ఒత్తిడిగా భావించడం లేదని, ఆ బాధ్యత వల్లే మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేయగలుగుతానని గిల్ అభిప్రాయపడ్డారు.

"కెప్టెన్సీ నాపై అదనపు బాధ్యతను పెంచింది. ఒత్తిడిలో నేను బాగా ఆడగలను, నా అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. అయితే నేను బ్యాటింగ్ చేసేటప్పుడు, ఒక బ్యాటర్‌గా మాత్రమే ఆలోచిస్తాను. కెప్టెన్‌గా ఆలోచించడం వల్ల అనవసరమైన ఒత్తిడి తీసుకుని, నా షాట్లు ఆడే స్వేచ్ఛను కోల్పోయే అవకాశం ఉంటుంది" అని గిల్ చెప్పుకొచ్చాడు.

రో-కో ద్వయంపై కళ్లన్నీ!

ఈ ఏడాది మార్చిలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్, విరాట్ భారత జెర్సీలో కనిపించడం ఇదే తొలిసారి. దాదాపు ఏడు నెలల తర్వాత మైదానంలోకి దిగుతున్న ఈ దిగ్గజాల ప్రదర్శనపై అభిమానుల దృష్టి నెలకొంది. ఆస్ట్రేలియాపై ఘనమైన రికార్డులు ఉన్న ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు, కొత్త కెప్టెన్‌కు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. భారత వన్డే చరిత్రలో నూతన అధ్యాయం మొదలుకానున్న ఈ సిరీస్‌ను గిల్ ఎలా నడిపిస్తాడో చూడాలి.

రో-కోతో నా బంధం చెక్కుచెదరలేదు: గిల్ - Tholi Paluku