Let's talk: editor@tmv.in
రో-కోకు డిమోషన్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో 'బి గ్రేడ్'

రో-కోకు డిమోషన్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో 'బి గ్రేడ్'

Shaik Mohammad Shaffee
11 ఫిబ్రవరి, 2026

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2025-26 సీజన్‌కు

సంబంధించి ఆటగాళ్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. ఈసారి కాంట్రాక్టుల

జాబితాలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్

కోహ్లి, రోహిత్ శర్మలకు ఊహించని షాక్ తగిలింది. గత సీజన్ వరకు అత్యున్నతమైన 'ఎ

ప్లస్' (ఏ+) కేటగిరీలో ఉన్న వీరిద్దరినీ ఈసారి ఏకంగా 'బి' కేటగిరీకి తగ్గించారు. మొత్తం 30

మంది పురుషులు, 21 మంది మహిళా క్రికెటర్లకు ఈ ఏడాది కాంట్రాక్టులు దక్కాయి.

'ఏ ప్లస్' కేటగిరీకి స్వస్తి

బీసీసీఐ ఈసారి అత్యున్నత గ్రేడ్ అయిన 'ఎ ప్లస్'ను పూర్తిగా రద్దు చేసింది. కేవలం మూడు గ్రేడ్‌లను (ఏ, బీ, సీ) మాత్రమే ఉంచింది. తాజా జాబితాలో టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాత్రమే అత్యున్నతమైన గ్రేడ్-ఏలో చోటు దక్కించుకున్నారు. జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, టెస్టులు, వన్డేల్లో కీలక ఆటగాడు కావడంతో ఆయనకు గ్రేడ్-ఏ దక్కింది.

దిగ్గజాల ‘గ్రేడ్’ ఎందుకు తగ్గింది?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ‘గ్రేడ్-బి’కి తగ్గించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. వీరిద్దరూ గతేడాది టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అంతకుముందే 2024లో టీ20ల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం వీరు కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆడే ఫార్మాట్లు తగ్గడం వల్లే వీరి గ్రేడ్లను తగ్గించినట్లు తెలుస్తోంది. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ‘గ్రేడ్-బి’లోనే ఉన్నారు.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల జాబితా (2025-26)

మహిళా జట్టుకు 'వరల్డ్ కప్' కానుక

మహిళా వన్డే ప్రపంచకప్ సాధించిన భారత మహిళా జట్టుకు బీసీసీఐ తగిన గుర్తింపునిచ్చింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు అత్యున్నతమైన గ్రేడ్-ఎలో కొనసాగుతున్నారు. మొత్తం 21 మంది మహిళా క్రికెటర్లకు కాంట్రాక్టులు లభించాయి. రేణుకా ఠాకూర్, షెఫాలీ వర్మ వంటి వారు గ్రేడ్-బిలో చోటు దక్కించుకున్నారు.

కాంట్రాక్టుల ప్రాధాన్యత

బీసీసీఐ ప్రతి ఏటా ఆటగాళ్ల ప్రదర్శన, ఫిట్‌నెస్, జట్టులో వారి ప్రాధాన్యతను బట్టి ఈ కాంట్రాక్టులను ఖరారు చేస్తుంది. ఈ వార్షిక వేతనంతో పాటు ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు, ప్రోత్సాహకాలు అదనంగా అందుతాయి. ఈసారి గ్రేడ్ల వారీగా చెల్లించే మొత్తాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించలేదు. గతంలో గ్రేడ్-ఏకు రూ.5 కోట్లు, ‘బి’కు రూ.3 కోట్లు, ‘సి’కు రూ. 1 కోటి చొప్పున చెల్లించేవారు.

కుటుంబ సభ్యుల బసపై బీసీసీఐ ఆంక్షలు

2025 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో ఆటగాళ్ల కుటుంబ సభ్యుల బసపై బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై కోవిడ్ పూర్వ నిబంధనలే అమలులో ఉంటాయని, ఈ మెగా టోర్నీకి ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఆటగాళ్లు వ్యక్తిగత ఖర్చులతో కుటుంబాలను దగ్గరలో ఉంచుకోవచ్చని తెలిపింది.