Let's talk: editor@tmv.in
రైళ్లలో ‘హలాల్’ మాంసమే పెడతారా? ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసు

రైళ్లలో ‘హలాల్’ మాంసమే పెడతారా? ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసు

Pinjari Chand
27 నవంబర్, 2025

రైళ్లలో నాన్‌వెజ్ భోజనంలో కేవలం ‘హలాల్’ ప్రాసెస్ చేసిన మాంసం మాత్రమే సర్వ్ చేయడం హిందూ, దళిత సమాజాన్ని వివక్ష చూపుతోందని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో రైల్వే బోర్డు ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. భోపాల్‌కు చెందిన సునీల్ అహిర్వార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుడు ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని బెంచ్ స్వయంగా ఈ ఫిర్యాదును స్వీకరించి, నవంబర్ 24న ఆదేశాలు జారీ చేసింది.

ఇతరుల జీవనాధారం దెబ్బతింటోంది

రైళ్లలో హలాల్ మాంసం మాత్రమే అందించడం వల్ల హిందూ షెడ్యూల్డ్ కులాలు, ఇతర నాన్-ముస్లిం సమాజాల జీవనాధారం తీవ్రంగా దెబ్బతింటోంది. రైల్వే ప్రభుత్వ సంస్థ కావడంతో అన్ని మతాల వారికి ఆహార ఎంపిక హక్కు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇది భారత రాజ్యాంగంలోని లౌకికవాద స్ఫూర్తికి విరుద్ధమని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఫిర్యాదుదారుడు సునీల్ అహిర్వార్ ఆరోపించిన ముఖ్య అంశాలు: రైళ్లలో హిందూ, సిఖ్ ప్రయాణికులకు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా ఆహారం లభించడం లేదు. ఇది సమానత్వం (ఆర్టికల్ 14), వివక్ష రహితం (15), వృత్తి స్వేచ్ఛ (19(1)(జీ)), గౌరవంతో జీవించే హక్కు (21), మత స్వేచ్ఛ (25) లాంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. మాంస వ్యాపారంలో సంప్రదాయంగా ఉన్న దళిత హిందూ సామాజిక వర్గాల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి.

సుప్రీంకోర్టు తీర్పులు (ఓల్గా టెలిస్ 1985, శబరిమల కేసు 2018, అప్పా బాలు ఇంగ్లే కేసు 1995) గుజరాత్ ఘటనలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్వయంగా ఇచ్చిన తీర్పు (2009)లను ఉటంకిస్తూ ఫిర్యాదుదారుడు ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని వాదించాడు. ఈ ఆరోపణలు మానవ హక్కుల ఉల్లంఘనగా కనిపిస్తున్నాయని పేర్కొన్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. రైల్వే బోర్డు ఛైర్మన్‌ను రెండు వారాల్లో విచారణ నిర్వహించి, చర్యలు తీసుకున్న నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రైల్వే అధికారుల నుంచి ఇంకా స్పందన రాలేదు. దీంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా కొత్త చర్చను రేకెత్తించే అవకాశం ఉంది. రైళ్లలో ఆహారం కూడా మతం, కులం రాజకీయాల బారిన పడిందా? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.